JAISW News Telugu

Filing ITR : ఇలా వచ్చే ఆదాయాలకు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.. ఐటీఆర్ ఫైలింగ్ కు ముందు ఇవి తెలుసుకోవాలి..

Filing ITR

Filing ITR

Filing ITR : దేశ వ్యాప్తంగా ఆదాయపు పన్ను ఫైలింగ్ (ఐటీఆర్) ఇప్పటికే పూర్తి చేశారు. కొందరు చేయాల్సి ఉంది. ఈ నెల (జూలై) ఆఖరు వరకు ఎలాంటి పైన్ లేకుండా రిటర్న్స్ సమర్పించేందుకు తుది గడువు కావడంతో త్వరపడుతున్నారు. అయితే, దీనికి ముందు పన్ను వర్తించని ఆదాయాల గురించి తెలుసుకుంటే కొంత టాక్స్ తగ్గించవచ్చని నిపుణులు చెప్తున్నారు. 10 రకాల ఆదాయాలు పన్ను పరిధిలోకి రావని చెప్తున్నారు. అవేంటో చూద్దాం..

వ్యవసాయం (సాగు)పై వచ్చే ఆదాయానికి పన్ను మినహాయింపు ఉంటుంది. కేవలం పంటలపై మాత్రమే కాకుండా సాగు భూమి, అందులోని భవనాల నుంచి పొందే అద్దెపై కూడా మినహాయింపు ఉంటుంది. సాగు భూమి కొనుగోలు, అమ్మకాలపై లాభం కూడా పన్ను రహితమే.

ఎన్ఆర్ఈ ఖాతాలు, వాటి డిపాజిట్లపై వచ్చే ఆదాయం పన్ను రహిత ప్రయోజనాలను అందిస్తోంది. ఎన్ఆర్ఐలు ఈ ఖాతాల ద్వారా తమ స్వస్థలానికి తేలికగా నిధులను బదిలీ చేయవచ్చు. ప్రైవేట్ సెక్టార్‌ ఉద్యోగుల విరమణలో పొందుతున్న గ్రాట్యూటీ 20 లక్షల వరకు ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు. పట్టణ ప్రాంతంలోని సాగు భూమికి బదులు పరిహారం పొందుతున్న వారికీ మినహాయింపు ఉంటుంది.

ఆదాయపు పన్ను చట్టం ప్రకారం.. పార్ట్నర్ షిప్ సంస్థ ఆదాయంపై ఎంటీటీ స్థాయిలో పన్ను ఉంటుంది. కాబట్టి పార్ట్నర్స్ పన్ను చెల్లించిన తర్వాత లాభంలో వాటా పొందుతారు. దీనిపై తిరిగి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ఉన్నత చదువుల కోసం ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల నుంచి స్కాలర్‌షిప్పులు పొందుతున్న విద్యార్థులు కూడా పన్నుల పరిధిలోకి రారు.

ఐదేళ్ల కంటే ఎక్కువ కాలం చందా చెల్లించినట్లయితే వారు కంపెనీలు మారినా వారి ప్రావిడెంట్‌ ఫండ్‌ (పీఎఫ్)పై ట్యాక్స్ ఉండదు. విరమణ తర్వాత తీసుకునే పీఎఫ్ పై కూడా ఇదే నిబంధన వర్తిస్తుంది. కొన్ని సంస్థల నుంచి వ్యక్తులకు వచ్చే పెన్షన్లు, ఉద్యోగులపై ఆధారపడ్డ వారు పొందే కుటుంబ పింఛన్లు కూడా పన్ను పరిధిలోకి రావు.

స్వచ్ఛంద ఉద్యోగ విరమణ సమయంలో స్వీకరించిన మొత్తంలో రూ. 5 లక్షల వరకు పన్ను మినహాయింపు ఉంటుంది. బంధువుల నుంచి లేదంటే వివాహం సందర్భంగా స్వీకరించే బహుమతులపై పన్ను ఉండదు. వీటితో పాటు ప్రభుత్వం అందించే అలవెన్సులు కూడా ట్యాక్స్ పరిధిలోకి రావు. విరమణ అనంతరం PSU ఉద్యోగులు పొందే పరిహారంపై పన్ను నుంచి మినహాయింపు ఉంటుంది.

Exit mobile version