Minister Komati Reddy:ఢిల్లీలో సకల సౌకర్యాలతో తెలంగాణ భవన్‌ను నిర్మిస్తామని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ భవన్ నిర్మాణానికి మంత్రి కోమటిరెడ్డి స్థలాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ భవన్ నిర్మాణం ఇప్పటికే ఆలస్యమైందన్నారు. మార్చిలోగా తెలంగాణ భవన్ నిర్మాణంపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఏప్రిల్ నాటికి భవన్ నిర్మాణం పనులు చేపట్టాలని భావిస్తున్నామని తెలిపారు.
ఢిల్లీలో ఇరు రాష్ట్రాల ఉమ్మడి భవన్ ఆస్తుల పంపకంపై మంగళవారం చర్చించనున్నట్లు మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. ఉమ్మడి భవన్ విభజనలో ఎలాంటి వివాదాలు లేవని తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. గత ప్రభుత్వ వైఖరి వేరు.. తమ ప్రభుత్వ వైఖరి వేరని తెలిపారు. ఉమ్మడి భవన్ ను ఎలా విభజించాలన్న విషయంపై వివిధ ప్రతిపాదనలు ఉన్నాయన్నారు. అన్నింటి గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.