Political Leaders : ఒకప్పుడు తెలంగాణ రాజకీయాలు స్వచ్ఛంగా ఉంటాయి.. హత్యా రాజకీయాలు, తిట్ల రాజకీయాలు ఉండవు అనేవారు. అయితే హత్యా రాజకీయాలు పెద్దగా లేకపోయినా బూతుల రాజకీయాలైతే ఈ మధ్య బాగా పెరిగిపోయాయి. ఏపీలో బూతుల రాజకీయాలు ఎలాగూ ఉన్నాయి.. ఇప్పుడా సంస్కృతి తెలంగాణలోనూ పెచ్చుమీరిపోతోంది.
తెలంగాణలో తిట్ల రాజకీయాలకు కేసీఆర్ ను ఆద్యుడిగా చెప్పుకోవచ్చు. గతంలో తెలంగాణ ఉద్యమంలో జనాలను ఉత్తేజపరుచడానికి ఆయన ఆసక్తికర ప్రసంగాలు చేసేవారు. దేశంలోనే అద్భుత వాగ్దాటి ఉన్న నేతల్లో ఆయన మొదటివరుసలోనే ఉంటారు. కాకపోతే ఆయన ప్రసంగాల్లో అప్పుడప్పుడు బూతు పదాలు కూడా వచ్చేవి. ప్రత్యర్థి నేతలను బాగానే తిట్టేవారు. ఓ సారి కిషన్ రెడ్డిని ‘రండ కిషన్ రెడ్డి’ అని తిట్టడం బాగా వైరల్ అయ్యింది. దీనిపై కేంద్రమంత్రిని అలా తిట్టడమేంటని జనాలు విస్తుపోయారు.
తాజాగా ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి.. కేసీఆర్ ను తీవ్రంగా దుర్భాషలాడారు. ‘రండ’ కేసీఆర్ అంటూ తీవ్రంగా తిట్టడంపై బీఆర్ఎస్ శ్రేణులు మండిపడుతున్నాయి. ఈక్రమంలో బాల్క సుమన్ లాంటి వాళ్లు సీఎం రేవంత్ రెడ్డిని ఓ అడుగు ముందుకేసి ఫాల్తూ గాడు.. చెప్పుతో కొడుతా.. లాంటి పదాలతో విరుచుకుపడ్డారు.
గతంలో కేసీఆర్ కానీ, ఇప్పుడు రేవంత్ రెడ్డి కానీ.. అంతలా దూషించడం ఎందుకు? అనే ప్రశ్న విశ్లేషకుల నుంచి వస్తోంది. రండ అంటే వేశ్య అనే అర్థం వస్తుంది. అంటే ఒళ్లు అమ్ముకుని జీవించే మహిళ అని చెప్పవచ్చు. ఈ పదం ఓ రకంగా చెప్పాలంటే మహిళలను, తిట్టు పడిన వారిని బాధించినట్టే.
తెలంగాణలో రాజకీయాలు హుందాగా ఉంటాయని అందరు చెప్పుకునేవాళ్లు. ప్రస్తుత రాజకీయాలు చూస్తుంటే ‘ఇదేం భాష’ అని తల పట్టుకునే పరిస్థితి. బూతుల రాజకీయాలపై మొన్ననే వెంకయ్య నాయుడు, చిరంజీవి సైతం ఆవేదన వ్యక్తం చేశారు. బూతుల నాయకులకు పోలింగ్ బూత్ లో సమాధానం చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. వారు హితువు పలికి గంట కూడా కాకముందే.. ఈ బూతులు పరాకాష్టకు చేరడం..గమనార్హం. రాజకీయాల్లో బూతులకు అడ్డుకట్ట వేయకుంటే మేధావులు, గొప్ప వ్యక్తులు ఈ రంగంలోకి రాలేరు. ఇది ప్రజాస్వామ్య మనుగడపై ప్రభావం చూపే అవకాశమూ ఉంది.