Students : ఆంధ్రప్రదేశ్ లోని ఓ పాఠశాలలో స్కూల్ విద్యార్థులకు పెను ప్రమాదం తప్పింది. అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరం మండలం పెదార్కూర్ పంచాయతీ పరిధిలోని బండారు గూడెం గ్రామంలోని మండల పరిషత్ స్కూల్ లో ఉన్నట్టుండి పెద్ద శబ్ధంతో స్కూల్ స్లాబ్ కూలిపోయింది. పెచ్చులూడి కిందపడ్డాయి. ఈ సమయంలో పెచ్చులూడి కిందపడిన సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో విద్యార్థుల ప్రాణాలు దక్కాయి. లేకపోతే ఘోర ప్రమాదం సంభవించి ఉండేది. చింతూరు ఏజెన్సీ ప్రాంతంలోని ఈ స్కూల్ లో ప్రమాదం చోటు చేసుకోవడం తో అందరూ ఒక్కసారి గా ఉలిక్కి పడ్డారు.
స్కూల్ హెడ్మాష్టర్ ఎప్పటిలాగే విద్యార్థులకు పాఠాలు చెబుతోంది. ఉన్నట్లుంది సడెన్ గా పై కప్పు నుంచి పెద్ద శబ్ధం వచ్చింది. ఆ వెంటనే పెచ్చులు ఊడిపడటం ప్రారంభమయ్యాయి. దీంతో ప్రధానోపాధ్యాయురాలు, పిల్లలు ఆందోళనకు గురయ్యారు. వెంటనే బయటకు వచ్చేశారు. అయితే పెచ్చులూడి కిందపడే సమయానికి తప్పించుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. దీంతో పాఠశాల తరగతి గదుల్లో కూర్చొబెట్టాలంటేనే వణుకు పుడుతోందని టీచర్లు చెబుతున్నారు. గత్యంతరం లేక పాఠశాల ఆవరణలోని బయటే విద్యార్థులను కూర్చొబెడుతున్నారు. బయటే ఓపెన్ టాప్ బ్లాక్ బోర్డు ఏర్పాటు చేసి విద్యార్థులకు పాఠాలు చెబుతున్నారు.
ఈ ఘటనపై తక్షణమే అధికారులు చర్యలు తీసుకుని కొత్త భవనం నిర్మించి విద్యార్థుల కష్టాలు తీర్చాలని కోరుతున్నారు. స్కూల్ భవనం బాగా పాతగా అయిపోయిందని ఇప్పటికైనా దాన్ని బాగు చేయించాల్సిన పరిస్థితి ఉందన్నారు టీచర్లు. ఇప్పటికైనా ఎవరైనా పట్టించుకుని పాఠశాలను బాగు చేయిస్తే విద్యార్థులు లోపల కూర్చుండి చదువుకుంటారని చెప్పారు.
ఇకపై ఆంధ్రప్రదేశ్ లో కొత్త గా ఏర్పడిన కూటమి ప్రభుత్వం స్కూళ్లలో విద్యా ప్రమాణాలు పెంచాల్సిన అవసరం ఉందన్నారు. దీంతో పాటు పాఠశాల తరగతి గదుల పునర్నిర్మాణం, తదితర అంశాలపై దృష్టి సారించి మరమ్మతులు చేయించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. విద్యా వ్యవస్థపై సునిశిత పరిశీలన అవసరమని చెబుతున్నారు.