Team India : ఓ ఆటగాడు తన ఆటను పూర్తిస్థాయిలో ప్రదర్శించాలంటే అతడికి మంచి ఫిట్ నెస్ అవసరం. ఏ క్రీడలోనైనా మంచి ఫిట్ నెస్ ఉన్నవారినే విజయం వరిస్తుంది. అతడు భవిష్యత్ లో ఆ ఆటలో మరింత పేరు ప్రఖ్యాతులు తెచ్చుకునే అవకాశం ఉంటుంది. గాయాల పేరుతో కీలక టోర్నీలు ఆడకుంటే.. ఆటగాడికే కాదు.. జట్టుకు కూడా పెద్ద నష్టమే. మన టీమిండియాను చూస్తే ఆటగాళ్లు గాయాలతోనే సహవాసం చేస్తున్నట్టు కనిపిస్తోంది. నిత్యం ఎవరో ఒకరు గాయాల బారిన పడి ఆటకు దూరం కావడం ఆందోళన కలిగిస్తోంది. ఇది వారి ఆటకే కాదు పరోక్షంగా టీమిండియా ప్రదర్శనపై కూడా పడుతోంది. మరి ఇది కోచ్ ల వైఫల్యమా? ఆటగాళ్ల తప్పిదమా? అనేది తెలియట్లేదు. ఒక్క విరాట్ కోహ్లీ తప్ప మిగతా ఆటగాళ్లందరినీ గాయాలు వెంటాడుతూనే ఉన్నాయి.
గత ఏడాదిన్నర కాలంలో ఎంత మంది ఆటగాళ్లు గాయాల బారిన పడి ఆటకు దూరమయ్యారో తెలిస్తే మీరు షాక్ అవుతారు..రవీంద్ర జడేజా, జస్ ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా, దీపక్ చాహర్, ప్రసిద్ధ్ కృష్ణ, షమి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్.. ఇంకా చిన్న ప్లేయర్లను కూడా పరిగణలోకి తీసుకుంటే ఈ లిస్ట్ చాంతాడంత అవుతుంది. ఆటగాళ్లకు గాయాలు సాధారణమే కానీ..ఇలా వరుస టోర్నీల్లో ఒకరి తర్వాత ఒకరు జట్టుకు దూరం కావడమే ఆందోళన కలిగిస్తోంది.
ఇంగ్లాండ్ తో తొలి టెస్ట్ అవ్వగానే రాహుల్, జడేజా జట్టుకు దూరమయ్యారు. రెండో టెస్ట్ తర్వాత శ్రేయస్ అందుబాటులో లేకుండా పోయాడు. రాహుల్, శ్రేయస్ లను పాత గాయాలే తిరుగదోడినట్టు తెలుస్తోంది. మూడో టెస్ట్ కైనా రాహుల్ అందుబాటులో ఉంటడానుకుంటే కష్టమే అని తెలిసిపోయింది. జడేజాకు జట్టులో చోటు దక్కినప్పటికీ అతడు పూర్తిగా కోలుకున్నాడో లేదో తుది జట్టులోకి వస్తాడో రాడో తెలియదు. జడేజా, రాహుల్ మూడేళ్ల వ్యవధిలో 12 సార్లు గాయపడ్డారనే వార్త ఇటీవల హల్ చల్ చేసింది. ఇది మన ఇంజూరీ మేనేజ్ మెంట్ ఎంత పేలవంగా ఉందో తెలియజేస్తోంది.
మన ఆటగాళ్లు ఎవరు గాయపడినా వారిని బెంగళూరులోని జాతీయ అకాడమీ(ఎన్ సీఏ)కు పంపుతారు. అక్కడ బీసీసీఐ ఫిట్ నెస్ టీమ్ ఉంది. కోట్లలో వార్షిక వేతనాలు ఇచ్చి ఇంజూరీ మేనేజ్ మెంట్ టీమ్ ను నడిపిస్తోంది బీసీసీఐ. అయితే కొన్ని నెలల పాటు అక్కడ ట్రీట్ మెంట్ తీసుకుని సాధన చేసిన తర్వాత కూడా ఆటగాళ్లు పూర్తి ఫిట్ నెస్ సాధించడం లేదు. బుమ్రా విషయంలో బీసీసీఐ మెడికల్ టీం నవ్వులపాలైందో తెలిసిందే. అతడు పూర్తి ఫిట్ నెస్ అని ప్రకటించాక రెండు మూడు మ్యాచ్ లు ఆడేసరికే గాయం తిరగబెట్టి తిరిగి ఎన్ సీఏకు చేరాడు. ఏ జట్టుకు లేని సమస్య మనకే ఉందంటే ఎవరి లోపమో అర్థమవుతూనే ఉంది. ఈ విషయంలో ఇంజూరీ మేనేజ్ మెంట్ టీమ్ విఫలమే అని చెప్పకతప్పదు.