Politics : రాజకీయ కురుక్షేత్రంలో కాల గర్భంలో కలిసిన జెండాలెన్నో..
Politics : రాజకీయం అనేది ఎవ్వరికీ పూలబాట కాదు. బాటలో ఎన్నో ఎత్తు పళ్లాలు.. ముల్లు ఉన్నట్లే రాజకీయంలో ప్రత్యర్థుల వ్యూహాలు, వెన్నుపోట్లు ఉండనే ఉంటాయి. వీటిని తట్టుకుంటూ వ్యూహాలకు ప్రతివ్యూహాలను పన్ని, ఎదుటి వారికి చిక్కని వ్యక్తే రాజకీయాలను ఏలుతాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయ చిత్రంను క్షుణ్ణంగా పరిశీలిస్తే.. ఎన్నో రాజకీయ పార్టీలు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు వచ్చాయి. అయితే వాటిలో కొన్నింటికి మాత్రమే ప్రజాదరణ దక్కింది. మిగతావి కాలగర్భంలో కలిసిపోయాయి.
ఉమ్మడి రాష్ట్రంలో జాతీయ కాంగ్రెస్ పార్టీ దశాబ్ధాలుగా ఏకఛత్రాధిపత్యాన్ని కొనసాగింది. ఈ నేపథ్యలో ఒక ప్రాంతీయ పార్టీ అవసరం తెరమీదకు వచ్చింది. దీంతో అన్న నందమూరి తారక రామారావు తెలుగువాడి ఆత్మగౌరవం పేరుతో తెలుగుదేశం పార్టీని తీసుకువచ్చారు. అప్పటి వరకు హస్తం జెండా తప్ప మరో జెండా కనిపించని తెలుగు వారికి సైకిల్ జెండా కనిపించింది. పార్టీ పెట్టిన 9 నెలలకే తెలుగోడి పౌరుషం ఢిల్లీకి చూపించింది టీడీపీ జెండా. కొన్నేళ్లు స్థానికంగా ఏలుతూ వచ్చింది. ఎన్టీఆర్ మరణంతో టీడీపీలో చీలికలు వచ్చాయి.
ఎన్టీఆర్ సతీమణిగా చెలామణి అయిన లక్ష్మి పార్వతి 1995లో ‘ఎన్టీఆర్ టీడీపీ’ అంటూ పార్టీని ఏర్పాటు చేసింది. ఈ పార్టీకి ఈసీ సింహం గుర్తు కేటాయించింది. 2 సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కొన్న ‘ఎన్టీఆర్ టీడీపీ’ కనీసం డిపాజిట్లను కూడా దక్కించుకోలేకపోయింది. పార్టీ అధ్యక్షురాలు లక్ష్మి పార్వతి పోటీ చేసిన స్థానంలో కేవలం 900 ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో ఆమె తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసింది.
చంద్రబాబుతో వచ్చిన విభేదాల కారణంగా 1999లో ‘అన్న ఎన్టీఆర్’ అంటూ ఎన్టీఆర్ తనయుడు నందమూరి హరికృష్ణ పార్టీని స్థాపించాడు. ఆ తర్వాత వచ్చిన సార్వత్రిక ఎన్నికల్లో ఒక్కరిని కూడా చట్ట సభలకు పంపలేకపోయాడు. ఇక పార్టీ అధ్యక్షుడు హరికృష్ణ గుడివాడ నుంచి పోటీ చేసి టీడీపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయాడు. దీంతో తన పార్టీని టీడీపీలో విలీనం చేసి మళ్లీ బాబును ఆశ్రయించాల్సి వచ్చింది.
రాజకీయాల్లో జవాబుదారీ తనం ముఖ్యం. యువతకు వీటిపట్ల బాధ్యతగా ఉండాలని సంప్రదాయ రాజకీయ పార్టీలకు భిన్నంగా ఐఏఎస్ అధికారి జయప్రకాష్ నారాయణ తన ఉద్యోగానికి రాజీనామా చేసి 1996లో ‘లోక్ సత్తా’ అంటూ ఒక పొలిటికల్ పార్టీని తెచ్చారు. సమకాలిన రాజకీయ పరిస్థితులను తట్టుకొని రాజకీయాలు చేయడంలో జయప్రకాశ్ వెనుకబడిపోయారని చెప్పవచ్చు. రాజకీయాల్లో మార్పు రావాలనే లోక్ సత్తా తన సిద్ధాంతాలను మార్చుకోలేక రాజకీయ వెండితెర మీద సమాదైంది.
ఉమ్మడి రాష్ట్రంలో పుట్టుకచ్చిన మరో పార్టీ ‘ప్రజారాజ్యం’. దశాబ్దాలుగా వెండితెరను ఏలుతున్న ఒక హీరో రాజకీయాల్లోకి రావాలనే కాంక్షతో ప్రజారాజ్యం స్థాపించారు. ‘రైల్ ఇంజన్ గుర్తు’ 2008 లో ప్రజల ముందుకు తీసుకువచ్చారు మెగాస్టార్ చిరంజీవి. ఈ ఎన్నికల్లో టీడీపీ, కాంగ్రెస్ పార్టీతో తలపడి 18 స్థానాలను దక్కించుకున్నారు. అయితే, సినీ రంగం వేరు.. రాజకీయ రంగం వేరని తెలుసుకున్న చిరంజీవి తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు.
తెలంగాణ ఆవిష్కరణే ధ్యేయంగా తెరమీదకు వచ్చింది నటి విజయ శాంతి 2005లో స్థాపించిన ‘తల్లి తెలంగాణ’ పార్టీ. అయితే పార్టీని నడపడంలో విజయ శాంతి ఫెయిల్ అయ్యింది. ఇక తన పార్టీకి దగ్గరగా ఉన్న, పైగా జనాధరణ ఎక్కువగా ఉన్న కేసీఆర్ టీఆర్ఎస్ లో తల్లి తెలంగాణను విలీనం చేసింది.
ఇక, దేవేందర్ గౌడ్ కూడా టీడీపీ నుంచి బయటకు వచ్చి తెలంగాణలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని ‘నవ తెలంగాణ’ ఏర్పాటు చేశాడు. అయితే రాజకీయ కురుక్షేత్రంలో నిలబడడం అంత సులువు కాదని తెలుసుకున్న దేవేందర్ గౌడ్ టీఆర్ఎస్ లో తన పార్టీని విలీనం చేసి ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నాడు. ఇక ప్రత్యేక ఉద్యమంలో అధికారుల పక్షాణ నిలబడి జోరుగా కొట్లాడిన ప్రొ. కోదండరాం ‘తెలంగాణ జనసమితి’ పార్టీని ఏర్పాటు చేశాడు. అది కూడా కాలగర్భంలో కలిసిపోయింది.
తెలంగాణలో పుట్టుకచ్చిన మరో రాజకీయ పార్టీ ‘వైస్సార్ టీపీ’ తండ్రి రాజకీయ వారసత్వాన్ని తెలంగాణలో కొనసాగించాలని వైస్సార్ కూతురు వైస్ షర్మిల 2021 లో తెలంగాణలో దీన్ని ఏర్పాటు చేసింది. అయితే, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకుండా కాంగ్రెస్ పార్టీకి మద్దతిచ్చింది. ఎన్నికలు ముగిసిన తర్వాత తన పార్టీని కాంగ్రెస్ లో కలపి ఏపీపీసీసీ అధ్యక్షురాలి పదవిని కొట్టేసింది.
ఇలా తండ్రి రాజకీయ వారసత్వం తీసుకోవాలని కొందరు. పార్టీలో తమ పెత్తనమే సాగాలని మరికొందరు. రాజకీయంగా తామేంటో నిరూపించుకోవాలని కొందరు. మార్పు తేవాలని మరికొందరు రాజకీయ కురుక్షేత్రంలో అడుగు పెట్టినప్పటికీ ఒత్తిడిని తట్టుకోలేక కొందరు కాలగర్భంలో కలిసిపోతే.. మరికొందరు ప్రజల హృదయాల్లో నిలిచిపోయారు.