Telangana Politics : నీవు నేర్పిన విద్యయే కదా నీరజాక్షా అన్నట్లు ఉంది బీఆర్ఎస్ పరిస్థితి. చెరపకురా చెడేవు అంటారు. అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ నేతలను తమ పార్టీలోకి తీసుకున్న బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు తమ పార్టీ నేతలే జంపు జలానీలుగా మారుతుండటంతో చూస్తూ ఊరుకోవాల్సింది పోయి వారి మీదే కారాలు మీరాలు నూరుతున్నారు. ఇంతకుముందు మీరు చేసిందేమిటి అనే అనుమానాలు వస్తున్నాయి.
ఎమ్మెల్యేలకు భరోసా కల్పించి వారు పార్టీ మారకుండా చూసుకోవాల్సిన బాధ్యతను వదిలేసి పార్టీని వీడే వారిని టార్గెట్ చేసుకోవడం వారి పెంకితనానికి పరాకాష్టగా మారుతోంది. కేసీఆర్, కేటీఆర్ పార్టీ ఫిరాయింపుల చట్టం ఉందనే విషయం ఆనాడు మరిచిపోయారు. ఇప్పుడు అదే చట్టం ప్రకారం వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడం వారి వెర్రితనానికి నిదర్శనంగా నిలుస్తోంది.
పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం ఓ పార్టీకి చెందిన మూడింట రెండు వంతుల ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా బయటకు వచ్చి వేరు కుంపటి పెట్టుకుంటే అనర్హత వేటు వేసే అవకాశం ఉండదు. ఈ విషయం తెలిసినా బీఆర్ఎస్ నేతలు ఆగ్రహంతో ఊగిపోవడం దేనికి సంకేతమో తెలియడం లేదు. బీఆర్ఎస్ హయాంలో ఏ పార్టీని వదిలిపెట్టని బీఆర్ఎస్ కు అదే కష్టం వస్తుందని అనుకోలేదు.
పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. పార్టీ భవిష్యత్ కోసం వారిని బుజ్జగించాల్సింది పోయి వారిని ఎడాపెడా తిట్టేయడంతో ఇంకా కొందరు అదే బాటలో ఉన్నారని తెలుస్తోంది. స్పీకర్ నిర్ణయమే శిరోధార్యం కావడంతో ఇక ఏం చేయలేని పరిస్థితి. అప్పుడు వారు చేసిన పనులే ఇప్పుడు వీరు చేస్తుండటంతో బీఆర్ఎస్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇలాంటి పరిస్థితి బీఆర్ఎస్ ఇంతకుముందు ఎప్పుడూ ఎదుర్కొలేదు. గత 23 ఏండ్లుగా తెలంగాణలో టీఆర్ఎస్ ఉరాఫ్ బీఆర్ఎస్ దే హవా. అయితే అప్పటికీ ఇప్పటికీ ప్రధాన తేడా ఏంటంటే.. అప్పుడు టీఆర్ఎస్ ను పాలకులు ఇబ్బందులు పెట్టినా అండగా జనాలు, ముఖ్యంగా యువత ఉండేవారు.. ఇప్పుడు వారి వెనక ఎవరూ లేకపోవడమే తేడా.