KCR : మూడోసారి అధికారంలోకి రావడం పక్కా అనుకున్నారు కేసీఆర్. నిరుద్యోగులు, ఉద్యోగుల్లో వ్యతిరేకత ఉన్నా రైతులు, పింఛన్ దారులు ఓటేస్తారులే అని తక్కువ అంచనా వేశారు. చివరకు ఏమైంది వ్యతిరేకత ఓట్లే అధికారాన్ని లాగేశాయి. తెలంగాణ ఏర్పాటులో కీలకపాత్ర పోషించిన నిరుద్యోగుల సమస్యలను పదేండ్ల పాలనలో ఒక్కసారి పట్టించుకోని కేసీఆర్.. వారి ఆగ్రహానికి గద్దె దిగి రావల్సి వచ్చింది.
ఇక కేసీఆర్ అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటగా దృష్టిసారించింది ఇతర పార్టీలను చీల్చడం, వారిని టీఆర్ఎస్ లోకి లాక్కోవడం. ఈ స్ట్రాటజీతోనే మొదటి ఐదేండ్లలో టీడీపీని తెలంగాణలో దాదాపు క్లోజ్ చేశారు. ఇక సెకండ్ టర్మ్ లో కాంగ్రెస్ లోని సగం మంది ఎమ్మెల్యేలను లాక్కున్నారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి వెళ్లడమనేది చాలా మంది రాజకీయ నాయకులు చేసేదే. వారికి పదవులు, కాంట్రాక్టుల ఆశలు చూపి తెలంగాణలో అన్ని పార్టీలను ఖతం చేసే పనిలోపడ్డారు.
అయితే ప్రజాస్వామ్యంలో ఉన్న గొప్ప విషయం.. ప్రజలు ఎంతటి కరడు గట్టిన నియంతనైనా గద్దె దించేయగలరు. వారి నిర్ణయానికి తిరుగులేదు. అధికారం విర్రవీగేవారికి సరైన సమాధానం తమ ఓటు ద్వారానే చేయగలరు. ఇప్పుడి సత్యం కేసీఆర్, కేటీఆర్ కు బోధపడుతుందో లేదో తెలియదు.
బీఆర్ఎస్ ను గద్దె దించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక..పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వారికై వారు కాంగ్రెస్ పంచన చేరడానికి రెడీ అయిపోతున్నారు. అలాగే మూడు, నాలుగు మున్సిపాలిటీలో కారు దిగి చేతిలోకి వెళ్లాయి. చివరకు కేటీఆర్ నియోజకవర్గ కేంద్రమైన సిరిసిల్ల మున్సిపాలిటీకి కాంగ్రెస్ వశమై పోయింది. ఇక జనాలు అప్పుడు వాళ్లు చేశారు.. ఇప్పుడు వీళ్లు చేస్తున్నారు అని లైట్ తీసుకుంటున్నారు.
అందుకే ఎన్నడూ అధికారం ఉందని కాకుండా.. ప్రజలకేం చేస్తున్నామనేదే ముఖ్యం. అధికారం ఇవ్వాళ ఉంటుంది..రేపు పోతుంది. కానీ రాజకీయ విలువలు ముఖ్యం. ప్రజలను తక్కువ అంచనా వేసి అహంకారంతో అధికారం పోగొట్టుకున్నారు. ఒకవేశ కాంగ్రెస్ కూడా ఇలానే అహంకారపూరితంగా వ్యవహరిస్తే దానికి కూడా శిక్ష తప్పదు. ప్రజాస్వామ్యంలో ప్రజల నిర్ణయమే ఫైనల్. పార్టీలు ఐదేండ్లు పాలించే కంపెనీ లాంటివి మాత్రమే. అంతే కాని ప్రజలపై తమ అధికార బలాన్ని ప్రయోగిస్తామంటే.. బ్యాలెట్ ద్వారా ప్రజలు గట్టి సమాధానమే చెబుతారు. ఇప్పటికైనా కేసీఆర్, కేటీఆర్ లు తమ ఓటమి ద్వారా పాఠాలు నేర్చుకుంటారేమో చూడాలి.