Jagan : తిరుపతిలో జరిగిన ఇండియా టుడే ఎడ్యుకేషన్ సమ్మిట్ లో పాల్గొన్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో విద్యా సంస్కరణల గురించి వివరించారు. అక్కడున్న జర్నలిస్టులు ఏపీ రాజకీయాల్లో తన సోదరి షర్మిలను కాంగ్రెస్ తనకు వ్యతిరేకంగా తీసుకురావడాన్ని ఎలా చూస్తున్నారని జగన్ ను అడిగారు.
ఆయన ఈ ప్రశ్నకు స్పందిస్తూ.. కాంగ్రెస్ నీచ రాజకీయాలకు పెట్టింది పేరని, వారి నీచ వ్యూహాల ప్రయత్నమే తన సోదరిని తనకు వ్యతిరేకంగా తీసుకురావడం అని జగన్ అన్నారు.
కాంగ్రెస్ డీఐవై పార్టీ. విభజించు-జయించు పద్ధతిని అనుసరిస్తారు. అప్పుడు వారి రాజకీయాల కోసం ఆంధ్రప్రదేశ్ ను అన్యాయంగా విభజించారు. ఇప్పుడు నా కుటుంబాన్ని విడదీశారు. అప్పటి ఎన్నికల్లో మా మామ వివేకారెడ్డిని నాపై నిలబెట్టారు. ఇప్పుడు నా సోదరిని నాకు వ్యతిరేకంగా తీసుకొచ్చారని, దీన్ని బట్టి వారు తమ ప్రయోజనాల కోసం అట్టడుగు స్థాయికి దిగజారిపోయారనడానికి నిదర్శనమని జగన్ వ్యాఖ్యానించారు.
ఏపీలో విద్యా సంస్కరణల గురించి జగన్ మాట్లాడుతూ.. తన సొంత పిల్లలకు ఉన్న విద్యా సౌలభ్యాలను ఏపీ పిల్లలకు అందించాలని అనుకుంటున్నట్లు తెలిపారు. ఏపీలో ఇంగ్లిష్ మీడియం విద్యకు వ్యతిరేకంగా వ్యాఖ్యానించిన ప్రతిపక్ష నేతలు తమ పిల్లలను ఏ మీడియంలో చదివించారో చెప్పాలని డిమాండ్ చేశారు.