Sharmila : కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వెంట రాజకీయం తిరుగుతన్నట్లు కనిపిస్తుంది. గతంలో తెలంగాణలో పెట్టిన వైఎస్సార్ టీపీని కాంగ్రెస్ లో విలీనం చేయడంతో కాంగ్రెస్ అధిష్టానం ఆమెకు బహుమతిగా ఏపీ బాధ్యతలను అప్పగించింది. కొన్ని రోజులుగా కుమారుడు రాజారెడ్డి వివాహం ఉండడంతో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనని ఆమె అవన్నీ ముగించుకొని బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధం అయ్యారు. పార్టీని ఎలాగైనా ప్రభుత్వంలోకి తేవాలని కార్యాచరణ రూపొందించుకొని ముందుకు సాగుతున్నారు.
కాంగ్రెస్ పార్టీ AP PCC చీఫ్ బాధ్యతలు తీసుకునేందుకు ఆమె విజయవాడలో భారీ కాన్వాయ్ తో వెళ్తున్నారు. అయితే పోలీసులు ఆమె కార్యకర్తలను అడ్డుకొని అనుమతి లేదంటూ నిలువరించారు. దీంతో కార్యకర్తలు పోలీసులు అడ్డుకున్న చోటనే వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వైఎస్ షర్మిల నాయకత్వంలో కాంగ్రెస్ పుంజుకుంటుందని అన్నారు. తమను అడ్డుకున్నంత మాత్రాన కాంగ్రెస్ పార్టీని అడ్డుకున్నట్లు కాదని అన్నారు. పార్టీ చాలా వేగంగా ప్రజల మనసుల్లోకి వెళ్లిందని వారు చెప్పారు.
ఈ ఘటనపై కాంగ్రెస్ పార్టీ స్టేట్ చీఫ్ షర్మిల మీడియాలో మాట్లాడుతూ విజయవాడలో తన కాన్వాయ్ ను అడ్డుకోవడం చూస్తుంటే వైసీపీకి చమటలు పడుతున్నాయని అర్థం అవుతుందన్నారు. తను బాధ్యతలు తీసుకునేందుకు కాన్వాయ్ తో వెళ్తానని ముందే అనుమతి తీసుకున్నానని, అయినా పోలీసులు అడ్డుకోవడం దేనికి సంకేతం అని ప్రశ్నించారు. ‘అంటే కాంగ్రెస్ ను చూసి ఈ ప్రభుత్వం భయపడుతుంది.. భయపడుతున్నారా సార్’ అంది. తమ కార్యకర్తలను అడ్డుకుంటే సహించేది లేదని, అవసరమైతే జైలుకు కూడా వెళ్తామని ఆమె పేర్కొంది.