Iran-Israel War : ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం పై ప్రపంచం స్పందన

Iran-Israel War

Iran-Israel War

Iran-Israel War : మధ్యప్రాచ్యం అగ్నిగుండమైంది. దాడులు, ప్రతి దాడులతో భగ్గుమంటోంది. లెబనాన్‌ను కొద్ది రోజులుగా వైమానిక దాడులతో బెంబేలెత్తిస్తున్న ఇజ్రాయెల్‌  భూతల దాడులను తీవ్రతరం చేసింది. లెబనాన్‌కు దన్నుగా నిలుస్తున్న ఇరాన్‌ కూడా ప్రతీకారేచ్ఛతో ఇజ్రాయెల్‌పై విరుచుకుపడింది. అమెరికా నిఘా విభాగం హెచ్చరికలను నిజం చేస్తూ మంగళవారం రాత్రి  భారీ వైమానిక దాడులకు దిగింది. ఇజ్రాయెల్‌ రాజధాని టెల్‌ అవీవ్‌ లక్ష్యంగా భారీ సంఖ్యలో బాలిస్టిక్‌ క్షిపణులను ప్రయోగించింది. కొన్నినిమిషాల వ్యవధిలోనే వందలాది మిసైళ్లు, రాకెట్లు దూసుకొచ్చాయి. టెల్‌ అవీవ్‌తో పాటు సమీపంలోని జెరుసలేం తదితర ప్రాంతాలు భారీ పేలుళ్లతో దద్దరిల్లిపోయాయి. భారీగా భవనాలు దెబ్బతిన్నాయి.. ఇరాన్‌కు దన్నుగా హెజ్‌బొల్లా కూడా టెల్‌ అవీవ్‌పైకి మిసైళ్లు ప్రయోగించింది. దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్‌ దేశవ్యాప్తంగా విమానాశ్రయాలన్నింటినీ మూసేసింది. ప్రజలందరినీ అప్రమత్తం చేసింది.  జోర్డాన్‌ రాజధాని అమ్మాన్‌పైకి కూడా మిసైళ్లు దూసుకెళ్లి కలకలం రేపాయి.

ఇరాన్‌ దాడులను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ తీవ్రంగా ఖండించారు. స్వీయరక్షణ చేపట్టేందుకు ఇజ్రాయెల్‌కు అన్నివిధాలా అండగా నిలుస్తామని ప్రకటించారు. ఇరాన్‌ మిసైళ్లను నేలకూల్చడంలో ఇజ్రాయెల్‌కు సహకరించాల్సిందిగా సైన్యాన్ని ఆదేశించారు. దాంతో మధ్యదరా సముద్రంలోని అమెరికా యుద్ధనౌకలు కూడా రంగంలోకి దిగి పలు ఇరాన్‌ క్షిపణులను అడ్డుకుని కూల్చేశాయి. ఇరాన్‌ దాడులకు తెగబడితే ఇజ్రాయెల్‌కు దన్నుగా రంగంలోకి దిగాల్సి వస్తుందని అమెరికా ఇప్పటికే హెచ్చరించింది.   మధ్యప్రాచ్యంలో మోహరించిన అమెరికా యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలు ఆ దిశగా రంగంలోకి దిగే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే మధ్య ప్రాచ్యంలోకి భారీగా ఫ్రాన్స్, యూకే పలుదేశాలు యుద్ధనౌకలను, సైన్యాన్ని మోహరిస్తున్నాయి.

ఇరాన్‌ తాజా దాడులపై ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు తీవ్రంగా స్పందించారు. మధ్యప్రాచ్యంలో తాము చేరలేని చోటంటూ ఏదీ లేదని పునరుద్ఘాటించారు. మొత్తానికి హమాస్‌ను ఏరివేసేందుకు గాజాపై ఏడాది క్రితం ఇజ్రాయెల్‌ తెరతీసిన దాడులు చివరికి లెబనాన్, ఇరాన్‌తో పూర్తిస్థాయి యుద్ధం దిశగా దారి తీసేలా కన్పిస్తున్నాయి. ఈ పరిణామంపై ప్రపంచ దేశాలన్నీ ఆందోళన చెందుతున్నాయి. ఇజ్రాయెల్‌పైకి భారీగా మిసైళ్లు ప్రయోగించినట్టు ఇరాన్‌ సైన్యం ‘ఇస్లామిక్‌ రివల్యూషనరీ గార్డ్‌ కోర్‌ (ఐఆర్‌జీసీ)’ ప్రకటించింది.  ఇరు పక్షాల మధ్య భారీగా కాల్పులు, రాకెట్‌ దాడులు జరుగుతున్నాయి.

TAGS