ఇరాన్ దాడులను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తీవ్రంగా ఖండించారు. స్వీయరక్షణ చేపట్టేందుకు ఇజ్రాయెల్‌కు అన్నివిధాలా అండగా నిలుస్తామని ప్రకటించారు. ఇరాన్ మిసైళ్లను నేలకూల్చడంలో ఇజ్రాయెల్‌కు సహకరించాల్సిందిగా సైన్యాన్ని ఆదేశించారు. దాంతో మధ్యదరా సముద్రంలోని అమెరికా యుద్ధనౌకలు కూడా రంగంలోకి దిగి పలు ఇరాన్ క్షిపణులను అడ్డుకుని కూల్చేశాయి. ఇరాన్ దాడులకు తెగబడితే ఇజ్రాయెల్‌కు దన్నుగా రంగంలోకి దిగాల్సి వస్తుందని అమెరికా ఇప్పటికే హెచ్చరించింది. మధ్యప్రాచ్యంలో మోహరించిన అమెరికా యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలు ఆ దిశగా రంగంలోకి దిగే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే మధ్య ప్రాచ్యంలోకి భారీగా ఫ్రాన్స్, యూకే పలుదేశాలు యుద్ధనౌకలను, సైన్యాన్ని మోహరిస్తున్నాయి.
ఇరాన్ తాజా దాడులపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తీవ్రంగా స్పందించారు. మధ్యప్రాచ్యంలో తాము చేరలేని చోటంటూ ఏదీ లేదని పునరుద్ఘాటించారు. మొత్తానికి హమాస్‌ను ఏరివేసేందుకు గాజాపై ఏడాది క్రితం ఇజ్రాయెల్ తెరతీసిన దాడులు చివరికి లెబనాన్, ఇరాన్‌తో పూర్తిస్థాయి యుద్ధం దిశగా దారి తీసేలా కన్పిస్తున్నాయి. ఈ పరిణామంపై ప్రపంచ దేశాలన్నీ ఆందోళన చెందుతున్నాయి. ఇజ్రాయెల్‌పైకి భారీగా మిసైళ్లు ప్రయోగించినట్టు ఇరాన్ సైన్యం ‘ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్ (ఐఆర్‌జీసీ)’ ప్రకటించింది. ఇరు పక్షాల మధ్య భారీగా కాల్పులు, రాకెట్ దాడులు జరుగుతున్నాయి.