Vamsadhara River : వంశధార ప్రాజెక్టు పనుల నిమిత్తం అక్కడకు వచ్చారు కొందరు కార్మికులు. కొద్ది రోజులుగా పనులు చేసుకుంటూ అక్కడే ఉంటున్నారు. వారంతా స్నానాలు చేసేందుకు దగ్గరలోని ప్రాజెక్ట్ వద్దకు ఆదివారం వెళ్లారు. అక్కడ వారికి కొన్ని విగ్రహాలు కనిపించడంతో ఆశ్చర్యంలో మునిగిపోయారు. పార్వతీపురం మన్యం జిల్లాలో ఈ అరుదైన ఘటన జరిగింది. వంశధార నదిలో పురాతన విగ్రహాలు బయటపడడం ఆ ప్రాంతంలో చర్చనీయాంశమైంది.
నేరడి బ్యారేజి దగ్గర పురాతన దేవతా విగ్రహాలు బయటపడ్డాయి. ఎండాకాలం కావడంతో వాటర్ ఫ్లో తగ్గడంతో విగ్రహాలు బయటపడ్డాయి. 5 దేవతా విగ్రహాలతో పాటు నంది, ఇతర శిలలను గుర్తించిన కార్మికులు వాటిని ఒడ్డుకు తెచ్చారు. ఈ వార్త తెలియడంతో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున అక్కడికి తరలివస్తున్నారు. కొందరు దేవతల విగ్రహాలకు కొబ్బరికాయలు కొట్టి పూజలు చేస్తున్నారు.
విగ్రహాలను గమనిస్తే గతంలో పూజలు చేసినట్టు కనిపిస్తున్నాయి. శిథిలావస్థకు చేరిన దేవాలయాలను తొలగించే సమయంలో తిరిగి ప్రతిష్ఠించే అవకాశం లేకపోవడంతో ఆ విగ్రహాలను జలాధివాసం చేసి ఉంటారని కొందరు అంటున్నారు. మరో వైపు తీరప్రాంతాల్లో పురాతన గుళ్లలో గుప్తనిధుల కోసం వేటగాళ్ల తాకిడి ఎక్కువగా ఉంది. అలా ఆలయాల్లో విగ్రహాలను తొలగించి గుప్తనిధుల వేట సాగిస్తున్నారు. అలాంటిది ఏమైనా జరిగిందా? అనే కోణంలో కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే విగ్రహాలు ఏ కాలం నాటివో పరిశీలిస్తున్నామని.. పూర్తి స్థాయిలో పరిశోధనలు చేసిన తర్వాత పూర్తి వివరాలు చెప్తామని ఎండోమెంట్ ఆఫీసర్లు చెబుతున్నారు.