Telugu Desam Party : కార్యకర్తే అధినేత.. తెలుగుదేశం పార్టీలో నూతన శకం

Telugu Desam Party
Telugu Desam Party : తెలుగుదేశం పార్టీ తన కార్యకర్తలే తమకు ముఖ్యమని చాటి చెబుతోంది. “కార్యకర్తే అధినేత” అనే నినాదాన్ని నిజం చేస్తూ, పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. ఇకపై ప్రతి కార్యకర్తను నేరుగా కలిసి వారి సమస్యలు తెలుసుకోవాలని, వారికి అండగా నిలవాలని పార్టీ నాయకత్వం నిర్ణయించింది.
తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు వెన్నంటి నిలిచిన కార్యకర్తలే నిజమైన బలమని చంద్రబాబు, లోకేష్ స్పష్టం చేశారు. దేశంలో ఏ పార్టీకి లేని బలమైన సంస్థాగత నిర్మాణం తెలుగుదేశం సొంతమని వారు గర్వంగా చెప్పారు. ఇటీవల కోటి సభ్యత్వాల మైలురాయిని చేరుకున్న సందర్భంగా, కార్యకర్తలే పార్టీకి అధిపతులని నారా లోకేష్ ప్రకటించారు.
ఈ మేరకు పార్టీ శ్రేణులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. అన్ని నియోజకవర్గాల్లో ప్రతి బుధవారం ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లు తప్పనిసరిగా కార్యకర్తలతో సమావేశం నిర్వహించాలని ఆదేశించారు. ఈ సమావేశాల్లో కార్యకర్తల సమస్యలను పరిష్కరించడంతో పాటు, వారికి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇవ్వనున్నారు.
నారా లోకేష్ తన నియోజకవర్గ పర్యటనలో భాగంగా ముందుగా కార్యకర్తలను కలుసుకుంటున్నారు. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకోవడంతో పాటు, క్లస్టర్, యూనిట్, బూత్ ఇంఛార్జ్‌లు, బాబు ష్యూరిటీ, శంఖారావం, ఓటర్ వెరిఫికేషన్, పార్టీ యాప్స్, సభ్యత్వ నమోదు వంటి కార్యక్రమాల్లో ఉత్తమ పనితీరు కనబరిచిన కార్యకర్తలను ప్రత్యేకంగా అభినందిస్తున్నారు.
– ప్రతి బుధవారం కార్యకర్తలతో సమావేశం తప్పనిసరి
పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు, ప్రతి నియోజకవర్గ ఇన్‌ఛార్జ్, ఎమ్మెల్యే ప్రతి బుధవారం ఉదయం నుండి మధ్యాహ్నం వరకు ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించాలి. అనంతరం మధ్యాహ్నం నుండి నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించి వారి సమస్యలను పరిష్కరించాలి, ఫిర్యాదులు స్వీకరించాలి. పార్టీ సంస్థాగత నిర్మాణం, వివిధ విభాగాల కార్యక్రమాలలో ఉత్తమ పనితీరు కనబరిచిన కార్యకర్తలను ఈ సమావేశాల్లో అభినందించాలని పార్టీ నాయకత్వం దిశానిర్దేశం చేసింది.
ఈ సమావేశాల అనంతరం, జరిగిన చర్చల సారాంశాన్ని (మినిట్స్) తప్పనిసరిగా కేంద్ర పార్టీ కార్యాలయానికి పంపాలని ఆదేశించారు. అంతేకాకుండా, ప్రతి నెల ఇంచార్జి మంత్రులు తమకు కేటాయించిన జిల్లాలో రెండు రోజుల పాటు పర్యటించాలి. మొదటి రోజు జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించగా, రెండవ రోజు పార్లమెంట్ అధ్యక్షులు, జోనల్ కోఆర్డినేటర్లతో కలిసి పార్టీ క్యాడర్ సమావేశం ఏర్పాటు చేయాలి.
సమావేశాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించిన పార్టీ నాయకత్వం, ఎవరైనా సమావేశాలు నిర్వహించని పక్షంలో లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని స్పష్టం చేసింది. ఈ నిర్ణయాల ద్వారా తెలుగుదేశం పార్టీ తన కార్యకర్తలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, వారిని పార్టీ అభివృద్ధిలో భాగస్వామ్యం చేస్తోందని స్పష్టంగా తెలుస్తోంది. కార్యకర్తలే నిజమైన నాయకులని భావిస్తున్న తెలుగుదేశం పార్టీ తీసుకున్న ఈ చర్యలు భవిష్యత్తులో ఎలాంటి ఫలితాలను ఇస్తాయో చూడాలి.