Jogi Ramesh : విరుగుతున్న ఫ్యాన్ రెక్కలు.. వైసీపీ మాజీ మంత్రి జోగి గుడ్‌ బై..!

Jogi

Jogi

Jogi Ramesh : ఏపీ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి తర్వాత వైఎస్సార్ సీపీ నాయ‌కులు ఆ పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌స్తున్న విష‌యం తెలిసిందే. చిన్నాపెద్దా లీడర్ల నుంచి కీల‌క‌ నాయ‌కుల దాకా ఒకరి వెనుక మరొకరు పార్టీ వీడుతున్నారు.వైఎస్సార్ సీపీ కీల‌క నేత‌, కృష్ణా జిల్లాకు చెందిన మాజీ మంత్రి జోగి ర‌మేశ్ సైతం ఆ పార్టీని వీడుతున్నట్లు తెలుస్తున్నది.

15 రోజుల ముందు నుంచే లీకులు
మాజీ మంత్రి జోగి అనుచ‌రులు తమ సోష‌ల్ మీడియా ఖాతాల నుంచి ‘మా అన్న మారుతున్నాడ‌హో!’ అంటూ 15 రోజుల ముందు నుంచే పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ”మా అన్న పార్టీ మారుతున్నాడు” అనే పోస్టు సోషల్ మీడియాలో దాదాపు రెండు వారాలుగా ట్రెండింగ్‌లో ఉన్నది. తన అనుచరుల ద్వారా 15 రోజుల ముందు నుంచే లీకులిస్తున్నారని స్పష్టమవుతున్నది. కాంగ్రెస్‌ పార్టీ నుంచి రాజకీయ జీవితం ప్రారంభించిన జోగి రమేష్  వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా పని చేశారు. వైసీసీ అధికారంలో ఉండగా చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేయ‌డంతో పాటు.. ఉండ‌వ‌ల్లిలోని ఆయన నివాసంపై దాడి చేసేందుకు కూడా ప్రయ‌త్నించగా, అప్పట్లోనే పోలీసులు కేసు న‌మోదు చేశారు. ఇక‌, ఇప్పుడు ఆ కేసు విచార‌ణలో వేగం  పుంజుకుంది.

మ‌రోవైపు.. జోగి కుమారుడు.. రాజీవ్‌.. అగ్రిగోల్డ్ భూముల కేసులో ఇరుక్కున్నాడు. ఈ కేసులో కొన్నాళ్లు జైల్లో ఉండ‌డం.. ఇటీవ‌ల బ‌య‌ట‌కు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో అనూహ్యంగా జోగి ర‌మేష్ యూట‌ర్న్ తీసుకోవ‌డం వైసీపీని మరింత షాక్ కు గురి చేస్తున్నది. జగన్ కు షాక్ తప్పదని తెలుస్తున్నది. వైఎస్సార్ సీపీకి, ప్రధానంగా జ‌గ‌న్‌కు న‌మ్మిన బంటు అయిన జోగి ర‌మేష్‌.. జ‌గ‌న్‌కు ఎంత చెబితే అంత అన్నట్టుగా వ్యవ‌హ‌రిస్తారని పార్టీలో టాక్‌  నడుస్తున్నది.

ఇక కేసులు న‌మోదైన‌ప్పుడు కూడా జోగి పార్టీతో పాటు జ‌గ‌న్‌ను కూడా వెనుకేసుకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఆయా కేసుల్లో తీవ్రత పెరుగుతుండ‌డం.. చంద్రబాబు నివాసంపై దాడి కేసులో జోగిని అరెస్టు చేసే అవ‌కాశం ఉంద‌ని చ‌ర్చ జ‌రుగుతుండడంతో పార్టీ మారాలని  జోగి నిర్ణయించుకున్నట్లు తెలుస్తున్నది. అయితే ముందుగా జ‌న‌సేనలో చేరేందుకు ప్రయత్నాలు చేసినా  వర్కౌట్ కాలేదు. దీంతో బీజేపీ పెద్దలతో కాళ్ల బేరానికి వెళ్లినట్లు సమాచారం. బీజేపీలో చేరితే తప్ప అగ్రి గోల్డ్ కేసుల నుంచి బయట పడే మార్గం కనిపించడం లేదని జోగి అనుచరుల టాక్. మరి బీజేపీ ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

TAGS