JAISW News Telugu

India : ప్రపంచం చూపు భారత్‌ వైపు!

India

India

India : ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్ మాత్రమే. వరల్డ్ వైడ్ గా ఈ సంవత్సరం 60కి పైగా దేశాల్లో ఎన్నికలు జరగనున్నాయి. కానీ అందరి చూపు భారత్ వైపే ఉంది. ఎందుకంటే భారత్ ఆయా దేశాలను కూడా ప్రభావితం చేస్తుంది కాబట్టి. ఏప్రిల్ 19తో మొదలైన సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ఏడు దశలతో జూన్ 1వ తేదీతో ముగించుకుంది. ఈ నేపథ్యంలో జూన్ 4వ తేదీ లెక్కింపు జరగనుంది.

ప్రాశ్చాత్య మీడియా ఇప్పుడు భారత్ పై ప్రధానంగా ఫోకస్ పెట్టింది. ఎన్నికలను కూడా బాగా కవర్ చేసింది. ఇండో-పసిఫిక్‌లో ఢిల్లీ కీలకం కావడం, ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదుగుతుండడం, అంతర్జాతీయ వేదికలపై భారత్‌ తన బాణిని బలంగా వినిపించడం వంటివి ప్రపంచ మీడియా దృష్టిని ప్రధానంగా ఆకర్షించాయి. దీంతో షెడ్యూల్ వచ్చినప్పటి నుంచి సీఎన్‌ఎన్‌ మొదలు బీబీసీ, ఫ్రాన్స్‌24, గ్లోబల్‌ టైమ్స్‌, అల్‌జజీరా వంటి అగ్రశ్రేణి మీడియా పోటాపోటీగా కథనాలు ప్రచురించింది. ఫలితాల కోసం ప్రపంచం ఉత్కంఠగా ఎదురుచూస్తుంది.

సీఎన్‌ఎన్‌ కవరేజ్‌..
సార్వత్రిక సమరం-2024లో 96 కోట్ల మంది ఓటర్లు పాల్గొననున్నారని,
ఇది యూఎస్, ఈయూ జనాభా కంటే ఎక్కువని సీఎన్‌ఎన్‌ ఏప్రిల్‌ నుంచే కథనాలు మొదలుపెట్టింది. నిరుద్యోగం, మౌలిక సదుపాయాలు, సంక్షేమం వంటి సమస్యలను ప్రస్తావించింది. భారత్ ఆర్థిక వృద్ధిలో దూసుకుపోతున్నా అసమానతలు పెరిగాయని పేర్కొంది. ‘చెరగని సిరా’ పేరుతో పోలింగ్‌ రోజు వేలిపై వేసే గుర్తు, దాని తయారీ రహస్యం వంటి అనేక అంశాలతో సుదీర్ఘ కథనం రాసింది. ప్రచారాల్లో మోదీ ప్రసంగాలు.. ముస్లింలపై చేసిన వ్యాఖ్యలు.. వాటిపై విపక్షాల స్పందనను విశ్లేషించింది. కన్యాకుమారిలోని స్వామి వివేకానంద స్మారకం వద్ద మోడీ ధ్యానం చేయడాన్ని స్పెషల్ స్టోరీగా మలిచింది.

న్యూయార్క్‌ టైమ్స్‌, వాషింగ్టన్‌ పోస్టు..
ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో సవాళ్లపై ‘వాషింగ్టన్‌ పోస్టు’ వరుసగా కథనాలను ప్రచురించింది. వీటితో పాటు పొలిటికల్ యాడ్స్ పై స్టోరీలు చేసింది. దేశంలో మహిళలు, యువత సంప్రదాయవాదులు కారని.. వారు ఈ సారి ఎటువైపు మొగ్గుచూపనున్నారనే కోణంలో వార్తలు రాసింది. డీప్ ఫేక్ ఫొటోలు, వ్యాఖ్యలపై కూడా కథనాలు ప్రచురించింది. మోడీ నేతృత్వంలోని పార్టీకి పశ్చిమ బెంగాల్‌లో లభిస్తున్న ఆదరణను విశ్లేషించింది. మోడీ బలాలు, విపక్షాల నుంచి అధికార పార్టీకి ఎదురవుతున్న సవాళ్లు, ఉచిత ధాన్యం పంపిణీపై ప్రజల్లో అభిప్రాయం, ఎగ్జిట్‌ పోల్స్‌ వంటి కథనాలను ‘న్యూయార్క్‌ టైమ్స్‌’ కవర్‌ చేసింది.

బ్రిటిష్‌ మీడియా బీబీసీ..
ఈ సారి బీబీసీ భారత్ ను బాగా మెచ్చుకుంది. భారత్ లో జరుగుతున్న లోక్ సభ ఎన్నికలు కేవలం భారత్ కే కాకుండా ప్రపంచానికీ కీలకమని ‘బీబీసీ’ కథనాల్లో చాలాసార్లు పేర్కొంది. ప్రపంచంలోనే అతిగొప్ప దేశమైన భారత్ తో కలిసి పని చేయాలని ప్రపంచ దేశాలు కోరుకుంటున్నాయని పేర్కొంది. ఆరోపణలు, ప్రత్యారోపణలు, దాడులు ఇలా ఎన్నికల చుట్టూ జరిగే వాటిపై ప్రత్యేక కథనాలు ప్రచురించింది. మహిళలు ఈ సారి దేశ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చారని ‘ది గార్డియన్‌’ పేర్కొంది.

హిందూవాదం.. ఫ్రెంచ్‌24
దశాబ్ధం పాటు అధికారంలో ఉన్న మోడీ పాలనకు తాజా ఎన్నికలు రెఫరెండంగానే భావించాలని ఫ్రెంచ్‌ మీడియా సంస్థ ‘ఫ్రాన్స్‌24’ ఒక కథనంలో పేర్కొంది. రామ మందిర నిర్మాణం, హిందుత్వం, ముస్లింలపై మోడీ వ్యాఖ్యలను ప్రస్తావించింది. ఎగ్జిట్‌ పోల్స్‌ను ఊటంకిస్తూ.. మోడీ మూడో సారి అధికారంలోకి వస్తారని పేర్కొంది.

మోదీ మ్యాజిక్‌.. అల్‌జజీరా
అసమానతలు, నిరుద్యోగం, ధరల పెరుగుదల లాంటి సమస్యలు ఉన్నా కూడా గత (2019) ఫలితాల కంటే ఈ సారి బీజేపీ మరింత మెరుగైన ఫలితాలను సాధిస్తుందని అల్‌జజీరా పేర్కొంది. దీనికి ముందు దేశంలో ముస్లింల అణచివేతపై కథనాలు రాసింది. అయినా.. ప్రతీ సారి సంఖ్యా బలాన్ని పెంచుకుంటూ హ్యాట్రిక్‌కు దగ్గరైందని చెప్పక తప్పలేదు. ఈ ఎన్నికల్లో బీజేపీ విజయానికి గల కారణాల వెనక ‘మోదీ మ్యాజిక్‌’ ఉందంటూ కథనాలు రాసింది.

వివాదాల చైనా..
సరిహద్దులో వివాదాలు కొనసాగుతున్నా.. భారత్ లో జరిగే ఎన్నికలపై చైనా మీడియా ప్రధాన దృష్టి సారించింది. ప్రచారంలో చైనాపై వ్యతిరేకంగా మాట్లాడవద్దని హితవు పలికింది. భారత్‌ తమ దేశ పెట్టుబడులకు ప్రధాన గమ్యస్థానం అంటూనే.. పొరుగు దేశ చర్యలు తమ సంస్థలను అసంతృప్తికి గురి చేశాయని పేర్కొంది. ప్రధాని మోడీ అరుణాచల్‌లో పర్యటించడాన్ని తప్పుపట్టింది. దాన్ని ఎప్పటికీ భారత్‌ భూ భాగంగా గుర్తించమని పాత పాట పాడింది. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు అధికార పక్షం ఇలాంటి చర్యలకు దిగుతోందని విమర్శించింది.

పాకిస్థాన్‌ వ్యాఖ్యలు..
దాయాదీ దేశంలో లోక్‌సభ ఎన్నికల వేళ ఆసక్తికర చర్చలు నడిచాయి. బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్‌ ఓడిపోవాలని ప్రతీ పాకిస్థాని అకాంక్షిస్తున్నట్లు మాజీ మంత్రి ఫవాద్‌ హుస్సేన్‌ వ్యాఖ్యానించారు. దీనికి ముందు అధికార పార్టీని విమర్శిస్తూ రాహుల్‌ చేసిన ప్రసంగాన్ని రీట్వీట్‌ చేయడం మరింత బీజేపీకి కలిసి వచ్చింది. కాంగ్రెస్‌ను పాకిస్తాన్ కీర్తిస్తున్నారంటూ బీజేపీ విరుచుకుపడింది.

అమెరికా మీడియాపై రష్యా మండిపాటు
భారత్‌లో ఎన్నికలపై రష్యా పలు సందర్భాల్లో స్పందించింది. ప్రజాస్వామ్య ప్రక్రియను ప్రభావితం చేసేందుకు అమెరికా ప్రయత్నిస్తోందంటూ ఆరోపించింది. భారత చరిత్రపై అమెరికాకు అవగాహన లేదంటూ మండిపడింది. ఖలిస్తానీ ఉగ్రవాది పన్నూ హత్య విషయంలో కుట్ర జరిగిందంటూ వాషింగ్టన్‌ పోస్ట్‌ రాసిన కథనంపై మాస్కో విరుచుకుపడింది.

తిప్పికొట్టిన భారత్‌..
భారత్ లో జరుగుతున్న ఎన్నికల విషయంలో పాశ్చాత్య మీడియా నెగెటివ్‌ కవరేజీని విదేశాంగ మంత్రి జై శంకర్‌ తిప్పికొట్టారు. భారత్‌పై ప్రాశ్చాత్య మీడియా ప్రభావం చూపాలని అనుకుంటుందని, ఇది మాకేమి కొత్త కాదన్నారు. వారి దేశంలో ఎన్నికల ఫలితాల కోసం కోర్టు మెట్లెక్కిన చాలా దేశాలు.. ఎన్నికలను ఎలా నిర్వహించాలనే జ్ఞానాన్ని తమకు నేర్పిస్తున్నాయంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. అదొక మైండ్‌ గేమ్‌ అన్నారు.

లోక్ సభ ఎన్నికలు కొనసాగుతున్న సమయంలో అంతర్జాతీయ మీడియా దృష్టి మొత్తం భారత్‌పైనా కొనసాగింది. ఫలితాలపై కూడా ప్రపంచ దేశాలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి.

Exit mobile version