Parliment:లోక్ స‌భ‌లోకి అగంత‌లు..ప‌బ్లిక్ గ్యాల‌రీ నుంచి స‌భ‌లోకి..

Parliment:పార్ల‌మెంట్‌పై ఉగ్ర‌దాడి జ‌రిగి 22 ఏళ్లు పూర్త‌వుతోంది. స‌రిగ్గా ఇదే స‌మ‌యంలో మ‌రోసారి లోక్‌స‌భ‌లో భ‌ద్ర‌తా వైఫ‌ల్యం చోటు చేసుకోవ‌డం దేశ వ్యాప్తంగా తీవ్ర క‌ల‌క‌లం రేపుతోంది. బుధ‌వారం లోక్ స‌భ‌లో ఇద్ద‌రు వ్య‌క్తులు గంద‌ర‌గోళం సృష్టించారు. ఓ వ్య‌క్తి ప‌బ్లిక్ గ్యాలరీ నుంచి లోక్‌స‌భ‌లోకి దూక‌గా, మ‌రో వ్య‌క్తి గ్యాల‌రీ నుంచి ఒక‌ర‌క‌మైన పొగ‌ను వ‌దిలి భ‌య‌భ్రాంతుల‌కు గురి చేశారు. లోక్‌స‌భ‌లోకి దూకిన వ్య‌క్తి ..ఎంపీలు కూర్చునే టేబుళ్ల‌పైకి ఎక్కి `న‌ల్ల చ‌ట్టాల‌ను బంద్ చేయాలి` అంటూ నినాదాలు చేసిన‌ట్టు స‌మాచారం.

ఈ ఘ‌ట‌న‌తో అప్ర‌మ‌త్త‌మైన ఎంపీలు వారిని చుట్టుముట్టి ప‌ట్టుకున్నారు. అనంత‌రం వారిని భ‌ద్ర‌తా సిబ్బందికి అప్ప‌గించారు. ఈ సంఘ‌ట‌న‌తో స్పీక‌ర్ వెంట‌నే స‌భ‌ను వాయిదా వేశారు. మ‌రో వైపు ఇదే స‌మ‌యంలో పార్ల‌మెంట్ భ‌వ‌నం బ‌య‌ట ఇద్ద‌రు వ్య‌క్తులు కూడా ఆందోళ‌న‌కు య‌త్నించారు. స‌ద‌రు వ్య‌క్తులు ప‌సుపు, ఎరుపు రంగు పొగ‌ని పార్ల‌మెంట్ ఆవ‌ర‌ణంలో వ‌దిలారు. దీంతో వారిని భ‌ద్ర‌తా సిబ్బంది వెంట‌నే అదుపులోకి తీసుకున్నారు.

వీరిలో ఓ మ‌హిళ కూడా ఉన్న‌ట్టు ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఈ ఘ‌ట‌న‌పై ఎంపీలు స్పందిస్తూ పార్ల‌మెంట్‌లో భ‌ద్ర‌త‌పై ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. `ఇద్ద‌రు వ్య‌క్తులు గ్యాల‌రీ నుంచి వ‌చ్చి ప‌సుపు రంగు గ్యాస్‌ను వ‌దిలారు. ఎంపీలు వెంట‌నే వారిని ప‌ట్టుకున్నారు. ఈ ఘ‌ట‌న‌తో కొత్త పార్ల‌మెంట్ భ‌వ‌నంలో భ‌ద్ర‌త‌పై సందేహాలు వ్య‌క్తం అవుతున్నాయి` అని కాంగ్రెస్ ఎంపీ గౌర‌వ్ గొగోయ్ సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. స‌రిగ్గా 22 ఏళ్ల క్రితం పార్ల‌మెంట్పై ఉగ్ర‌దాడి జ‌రిగిన విష‌యం తెలిసిందే. మ‌ళ్లీ అదే రోజు ఊహించ‌ని సంఘ‌ట‌న జ‌ర‌గ‌డం సంచ‌ల‌నంగా మారింది.

TAGS