Mata Vaishno Devi : దేశంలోని అద్భుతమైన ఆలయాల్లో ముందువరుసలో ఉంటుంది వైష్ణో దేవి ఆలయం. ఇది జమ్మూ కశ్మీర్ రాష్ట్రంలో ఉంది. ప్రసిద్ధి చెందిన అమ్మవారి పుణ్యక్షేత్రం. ఈ పుణ్యక్షేత్రం వైష్ణవ దేవి కొండలపై నెలకొని ఉంది. హిందువులు వైష్ణవ దేవినే మాతా రాణి అని వైష్ణవి అని కూడా సంభోదిస్తారు. ఈ ఆలయం ఉత్తర భారత్ లోని జమ్ము- కాశ్మీర్ రాష్ట్రంలో జమ్మూకు సుమారు 65 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఎత్తైన హిమాలయ పర్వత ప్రాంతంలోని త్రికూట పర్వత శేణిలో ఉంది. జమ్ము నుండి 50 కిలో మీటర్ల దూరంలో వున్న కాట్రా ప్రాంతానికి హెలి కాప్టర్లలో వెళ్లవచ్చు.
వైష్ణో దేవి నవరాత్రి సమయంలో జ్యోతిరూపంలో దర్శనమిస్తుంటుంది. ఆ వేడుకను చూసిన వారు నిజంగా ఎన్నో జన్మల పుణ్యం చేసుకుని ఉంటారు. ఆ సమయంలో మాతను దర్శించుకున్న వారికి పేదరికం, దు:ఖం దూరమవుతుందని కూడా కొందరు చెపుతుంటారు. తాజాగా ఓ వైష్ణో దేవి అమ్మవారి గుహ ఆలయాన్ని చిత్రీకరించిన వీడియో వైరల్ అవుతోంది.
ఈ వైష్ణోమాతను దర్శించుకోవడానికి ప్రపంచ నలుమూలల ఉన్న హిందూ భక్తులు తరలివస్తుంటారు. ఈ ఆలయం ఎన్ని ఏండ్ల కిందటిదో ఆధారాలు లేవు. భూగర్భ శాస్త్రవేత్తల పరిశోధనలో ఈ ఆలయం ఉన్న గుహ మిలియన్ సంవత్సరాల పూర్వం నుంచి ఉన్నట్లు తేలింది. ఏడాది పొడవున్నా అమ్మవారి ఆలయం తెరిచే ఉన్నప్పటికీ మార్చి నుంచి అక్టోబర్ వరకూ ఉత్తమ సమయం.
వైష్ణో దేవి విగ్రహం ఉన్నచోటుకు వెళ్లాలంటే గుహల్లో చాలా దూరం ప్రయాణించాలి. అయితే ఈ దూరాన్ని తగ్గించేందుకు మరో రెండు గుహల్లో అధికారులు దారులను ఏర్పాటు చేశారు. వైష్ణోదేవి ఆలయం ఉన్న కొండ సముద్ర మట్టానికి 5200 అడుగుల ఎత్తులో ఉంది. ఇక ప్రధాన ఆలయం ఉన్న గుహ 30 మీటర్ల పొడవు, 1.7 మీటర్ల ఎత్తు ఉంటుంది. వైష్ణోదేవి ఆలయం ఉన్న గుహలు కొన్ని లక్షల ఏండ్ల కిందనే ఏర్పడ్డాయట.
భైరవుడు అనే రాక్షసుడిని సంహరించిన తర్వాత దుర్గాదేవే వైష్ణోదేవి రూపంలో ఇక్కడ అవతరించిందని చెబుతారు. అలాగే ఆ రాక్షసుడి తల గుహ నుంచి లోయలో పడిపోయిందని స్థల పురాణం చెబుతోంది. రాక్షసుడి దేహం కూడా అక్కడే ఉన్న గుహల్లోని ఏదో ఒక గుహలో ఇప్పటికీ ఉందంటారు. అందుకే ఆలయం సమీపంలో ఉన్న గుహలను ఎప్పుడూ మూసే ఉంచుతారు.
వైష్ణోదేవి మాతను కొందరు లక్ష్మీ స్వరూపమని, మరికొందరు పార్వతీ స్వరూపమని చెబుతారు. నిజానికి మహాలక్ష్మీ, మహా కాళీ, మహా సరస్వతి.. ఈ ముగ్గురి తేజోమయ స్వరూపమే ఈ తల్లి అని పండితులు చెబుతున్నారు. భైరవుడునే రాక్షసుడి సంహారం కోసం ఆ మహాతల్లుల దీవెనతో వైష్ణవి అనే బాలిక జన్మిస్తుంది. రాక్షస సంహారం తర్వాత అమ్మవారు త్రికూటపర్వతంపై గుహలో 3 తలలతో 5.5 అడుగుల ఎత్తయిన రాతిరూపం ధరించింది. వైష్ణోదేవి గుహాలయంలో మనకు కనిపించే రాతిరూపాలు(పిండీలంటారు అక్కడివారు) ఆ మాత తలలే మహాకాళీ, వైష్ణోదేవి, మహా సరస్వతిగా చెబుతారు.
వైష్ణోదేవి ఆలయానికి జమ్మూ కశ్మీర్ లోని కట్రా వరకు రైలు, రోడ్డు, వాయు మార్గాలున్నాయి. అక్కడి నుంచి యాత్ర మొదలయ్యే మెయిన్ గేట్ వరకూ ఆటోలో వెళ్లవచ్చు. అక్కడి నుంచి డోలీ యాత్ర మొదలవుతుంది. జీవితంలో ఒక్కసారైనా ప్రతీ హిందువు వైష్ణోదేవిని దర్శించుకోవాలని పండితులు చెబుతుంటారు.