Crocodiles : వన్యప్రాణులు తరలిస్తున్న వాహనం బోల్తా.. రోడ్డుపై పడిపోయిన మొసళ్లు

Crocodiles
Crocodiles Fell on Road : నిర్మల్ జిల్లా మొండిగుట్ట సమీపంలోని 44వ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జంతువుల లోడ్ తో వెళ్తున్న లారీ బోల్తాపడింది. ఈ ఘటనలో లారీలోని మొసళ్లు రోడ్డుపై పడిపోయాయి. రంగంలోకి దిగిన ఫారెస్టు అధికారులు చాకచక్యంగా వాటిని పట్టుకున్నారు. నిర్మల్ జిల్లా మామడ మండలం మొండిగుట్ట సమీపంలోని 44వ జాతీయ రహదారిపై లారీ అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. దీంతో అందులోని రెండు మొసళ్లు రోడ్డుపై పడిపోయాయి. బీహార్ రాష్ట్రం పాట్నాలోని సంజయ్ గాంధీ బయోలాజికల్ పార్కు నుంచి బెంగళూరు బన్నెరఘట్ట బయోలాజికల్ పార్కుకు వన్యప్రాణులను తరలిస్తుండగా బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది.
రోడ్డుపై పడిన రెండు మొసళ్లు తప్పించుకునే ప్రయత్నం చేసినప్పటికీ ఫారెస్టు అధికారులు వాటిని చాకచక్యంగా పట్టుకున్నారు. ఈ లారీలో ఘరియాల్ జాతి మొసళ్లు, అరుదైన తెల్లపులి ఉన్నాయి. స్థానిక అటవీ అధికారులు మరో వాహనాన్ని సిద్ధం చేసి వాటిని అక్కడి నుంచి తరలించారు.