Deputy CM Pawan : డిప్యూటీ సీఎం ను కలవనున్న అగ్ర నిర్మాతలు.. ఏపీలో చిత్ర పరిశ్రమకు మంచి రోజులు రానున్నాయా?
Deputy CM Pawan Kalyan : ఏపీ ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ మంత్రి కావడంతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ వర్గాలు ఆనందంలో మునిగిపోయాయి. గత వైసీపీ సర్కారు ఏపీలో చిత్ర పరిశ్రమను తీవ్ర ఇబ్బందులకు గురి చేసిన విషయం తెలిసిందే. టికెట్ల రేట్లు తగ్గింపు, పవన్ కల్యాణ్ సినిమాలతో పాటు నిర్మాతలకు నష్టాలను తెచ్చిపెట్టాయి. చివరకు మెగాస్టార్ చిరంజీవి, ఇతర ప్రముఖ నటులు సీఎం జగన్ వద్దకు వెళ్లి టికెట్ల రేట్లు పెంచాలని ప్రాధేయపడ్డారు.
ప్రస్తుతం ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎం కావడం, జనసేన నుంచి మంత్రి కందుల దుర్గేశ్ సినిమాటోగ్రఫీ మంత్రి కావడంతో తెలుగు సినీ నిర్మాతలు ఫిల్మ్ ఇండస్ట్రీలోని సమస్యలను తెలిపేందుకు వీరిని కలవనున్నారు.
తెలుగు చిత్ర పరిశ్రమను హైదరాబాద్ లోనే కాకుండా వైజాగ్, తిరుపతి, విజయవాడ లాంటి ప్రాంతాల్లో విస్తరించేలా చర్యలు తీసుకోవాలని కోరానున్నారు.
దీంతో పాటు థియేటర్లలో సమస్యలు, టికెట్ల రేట్ల విషయంలో పడుతున్న ఇబ్బందులు బెనిఫిట్ షో ల వంటి విషయాల్లో జగన్ సర్కారు తీసుకున్న నిర్ణయాలతో ఫిల్మ్ ఇండస్ట్రీ తీవ్రంగా నష్టపోయింది. దీంతో ఎన్నికల సమయంలో టీడీపీ కూటమికి చాలా మంది సినీ నటీనటులు బహిరంగంగానే తమ మద్దతు ప్రకటించారు. పవన్ డిప్యూటీ సీఎం హోదాలో ఉండడంతో ఇండస్ట్రీలో ఉన్న సమస్యలు పరిష్కరిస్తాడని నమ్మకంగా ఉన్నారు.
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తో తెలుగు సినీ ప్రముఖులు నేడు భేటీ కానున్నారు. తెలుగు ఫిలిం చాంబర్ అధ్యక్షుడు దిల్ రాజు, దామోదర్ ప్రసాద్, బోగుపల్లి ప్రసాద్, డీవీవీ దానయ్య తదితరులు సీఎం పవన్ ను కలిసి తమ సమస్యలు తెలపనున్నారు. వీరితో పాటు నిర్మాతలు అశ్విని దత్, హారిక హాసిని, మైత్రి మూవీ మేకర్స్, సితార ఎంటర్ టైన్ మెంట్స్ , పీపుల్స్ మీడియా తదితర నిర్మాణ సంస్థలకు చెందిన అగ్ర నిర్మాతలు డిప్యూటీ సీఎం పవన్ ను, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్ ను కలిసి సమస్యలు పరిష్కరించాలని కోరనున్నారు.