Sharmila : ముహూర్తం ఫిక్స్.. షర్మిల బాధ్యతలు తీసుకునేది ఆరోజే..షెడ్యూల్ ఇదే..
Sharmila : ఏపీలో ఎన్నికలకు మరో రెండు, మూడు నెలలే ఉంది. అధికార పార్టీల జాబితాల మీద జాబితాలు ప్రకటిస్తూ..త్వరలోనే అభ్యర్థుల ఎంపికను పూర్తి చేయనుంది. ఇక టీడీపీ, జనసేన కూటమి కూడా అదే కసరత్తు చేస్తున్నాయి. వైసీపీ అభ్యర్థుల కంటే బలమైన అభ్యర్థులను బరిలో దించేందుకు వ్యూహత్మకంగా ముందుకెళ్తోంది. ఏపీ రాజకీయాల్లో డీలా పడి ఉన్న కాంగ్రెస్ కు షర్మిల రాకతో నూతనోత్తేజం వచ్చినట్టైంది. రాష్ట్ర అధ్యక్షురాలిగా ఆమెపై ఆ పార్టీ అధిష్ఠానం బరువైన బాధ్యతనే అప్పజెప్పింది. ఈనేపథ్యంలో ఆమె పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలను ఈనెల 21 స్వీకరించబోతున్నారు.
ఈమేరకు షర్మిల పర్యటన షెడ్యూల్ ఖరారైంది. జనవరి 20న మధ్యాహ్నం 2గంటలకు హైదరాబాద్ నుంచి ఇడుపులపాయకు బయలుదేరి సాయంత్రం 4గంటలకు వైఎస్ఆర్ ఘాట్ వద్ద దివంగత సీఎం రాజశేఖర్ రెడ్డికి నివాళి అర్పిస్తారు. ఆ రోజు రాత్రి ఇడుపులపాయలో బస చేసి, 21వ తేదీ ఉదయం కడప నుంచి విజయవాడ గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు.
విజయవాడలో ఉదయం 11గంటలకు పీసీసీ చీఫ్ గా వైఎస్ షర్మిల బాధ్యతలు స్వీకరిస్తారు. కాగా, షర్మిల రాజకీయ పర్యటన అందరిలో ఆసక్తి రేకెత్తిస్తోంది. రేపు కడప జిల్లా ఇడుపులపాయకు వెళ్తున్న క్రమంలోనే ఆమె భారీ ర్యాలీ నిర్వహిస్తారని, తన బలం ఏమిటో చూపించే ప్రయత్నం చేస్తారని ప్రచారం జరుగుతోంది. అంతేకాదు బాధ్యతలు స్వీకరించిన తర్వాత షర్మిల రాజకీయంగా ఏమి మాట్లాడబోతున్నారు? ఆమె తన అన్న జగన్ పాలనను టార్గెట్ చేసే అవకాశంఉందా? ఇతర రాజకీయ పార్టీలైన టీడీపీ, జనసేన, బీజేపీలపై ఆమె స్టాండ్ ఏమిటి? అన్నది కూడా ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. షర్మిల ఏపీ పాలిటిక్స్ లోకి ఎంట్రీ కావడం రాజకీయ పార్టీలకే కాదు.. ప్రజలకు కూడా ఆసక్తికరంగానే మారింది.