Stolen bike : దొంగలు పరారు.. చోరీ బైక్ స్వాధీనం

Stolen
Stolen bike : శుక్రవారం తెల్లవారుజామున గాజువాక సమీప డ్రైవర్స్ కాలనీ రామాలయం వీధిలో ఓ ఇంట్లో దొంగతనానికి యత్నించిన దొంగలు ఇరుగుపొరుగు వారు అప్రమత్తమవడంతో వారు తీసుకొచ్చిన చోరీ బైక్ ను వదిలేసి పరారయ్యారు. పోలీసులు తెలిపిన ప్రకారం.. ప్రైవేటు కాంట్రాక్టు పనులు చేసే మోహన్ రావు కుటుంబీకులు ఇటీవల అమెరికాలో ఉంటున్న కుమార్తె వద్దకు వెళ్లారు. ఆ ఇంటికి తాళాలు వేసి ఉండడంతో.. గుర్తు తెలియని వ్యక్తులు తలుపు విరగగొట్టి లోపలకు చొరబడ్డారు. పడక గదుల్లో ఉన్న బీరువాలను ధ్వంసం చేశారు. విలువైన సొత్తు ఏమీ లభించలేదు.
ఇంతలో కారు తాళం చెవి గుర్తించి, ఇంటి ఆవరణలో ఉన్న కారుతో సహా పారిపోవడానికి ప్రయత్నించారు. గేటు తెరుస్తున్న సమయంలో శబ్దం రావడంతో ఇరుగుపొరుగు వారు అప్రమత్తమయ్యారు. దీంతో తాము తీసుకొచ్చిన బైక్ ను అక్కడే వదిలేసి దొంగలు పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, మోహనరావు బంధువులు ఘటనాస్థలికి వెళ్లి పరిశీలించారు.