Telangana News : భార్యాభర్తల బంధం అపురూపమైనది. తిట్టుకున్నా, కొట్టుకున్నా కలిసి ఉండే బంధమది. వివాహ బంధంలోకి అడుగుపెట్టినప్పటి నుంచి కట్టే కాలే వరకు ఒకరికొకరు కలిసే ఉండే ఏకైక బంధం ఆలుమగలదే. అయితే వీరిద్దరి మధ్యలోనే ఎక్కువగా గొడవలు వస్తుంటాయి. చిన్న చిన్న గొడవలు ఏ కాపురంలోనైనా సహజమే అయినప్పటికీ కొన్ని మాత్రం విడాకుల దాక వెళ్తుంటాయి. ఇంకా కొన్ని దాడులు, ఆత్మహత్యలు, హత్యలకు కూడా దారితీస్తుంటాయి.
మనం ఎక్కడ చూసినా భార్యను కొట్టిన భర్త, భార్యను చంపిన భర్త..ఇలా ఎన్నెన్నో వార్తలు వింటూ ఉంటాం. చూస్తూనే ఉంటాం. భర్తను కొట్టిన భార్య, భర్తను చంపిన భార్య అరుదుగానే చూస్తుంటాం. కానీ మనం షాక్ అయ్యే విషయం ఏంటంటే..గత పదేళ్ల కాలంలో భర్తలపై దాడులు పెరిగిపోయాయి. పాపం భర్తలు భార్య దెబ్బలకు తాళలేక ఎవరికీ చెప్పుకోలేక తమలో తామే కుమిలిపోతున్నారట. అలాగే భార్య పెట్టే గృహ హింస తక్కువేమి కాదు. ఒకప్పుడు గృహ హింస అంటే భర్త, అత్తామామ పెట్టే హింస అనుకునేవాళ్లం. కానీ ఇప్పుడు భర్తలను భార్య, వారి తల్లిదండ్రులు పెట్టే గృహ హింస ఘటనలు పెరిగిపోతున్నాయి.
ఇలాంటి బాధాకరమైన ఘటనలు దేశంలో పెరిగిపోతున్నాయని బయో సోషల్ స్టడీస్ అనే రీసెర్చ్ సంస్థ వెల్లడించింది. ఇలా భార్యల చేతిలో చావుదెబ్బలు తింటున్న వారిలో తాగుబోతులు, నిరక్షరాస్యులే ఎక్కువగా ఉన్నారని సర్వే పేర్కొంది. దేశంలో భర్తలపై జరుగుతున్న డొమెస్టిక్ వయిలెన్స్ పై ఈ సంస్థ చేసిన రీసెర్చ్ ను కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ప్రెస్ ప్రచురించింది. దేశంలో భర్తలపై దాడులు 15 ఏండ్లలో దాదాపు ఐదింతలు పెరిగినట్టు సర్వే గుర్తించింది. ప్రతీ వెయ్యి మంది మహిళల్లో 36 మంది భార్యలు తమ భర్తలపై చేయి చేసుకుంటున్నారని సర్వే వెల్లడించింది. ఈ సంఖ్య మరింత ఎక్కువయ్యే చాన్స్ ఉందని అభిప్రాయపడింది.
ఈ సర్వే చెప్పిన మరో షాకింగ్ విషయం ఏంటంటే.. తెలంగాణలోనే భర్తలపై భార్యల దాడులు గణనీయంగా పెరుగుతున్నాయట. ఇందుకు ప్రధాన కారణం.. మగాళ్లు మద్యానికి బానిసలై భార్యలను వేధించడమేనని సర్వే పేర్కొంది. పదేళ్లలో రాష్ట్రంలో లిక్కర్ అమ్మకాలు భారీగా పెరిగిపోవడమే ఇందుకు నిదర్శనమని పేర్కొంది. ఎన్నికలు ఉన్నా లేకున్నా.. రాజకీయ నాయకులు జనాలకు మందు తాగించే సంస్కృతి విపరీతంగా ఎక్కువైందని వెల్లడించింది. వీటితో పాటు మద్యం తాగడం ఫ్యాషన్ గా మారిపోయింది. హైదరాబాద్ లో పాశ్చాత్య సంస్కృతితో పాటు గ్రామాల్లో వాడవాడనా బెల్ట్ షాపులు, మద్యం షాపులతో మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. దీంతో మద్యం ప్రియుల సంఖ్య బాగా పెరిగిపోతోంది. దీనివల్ల కుటుంబ కలహాలు సైతం పెరుగుతున్నాయి. తాగుడుకు బానిసైన మొగుడిని దారిలో పెట్టేందుకు సతీమణులు గరిటెలు, చీపుర్లు పట్టక తప్పడం లేదు.