Team India : ఐదు మ్యాచ్‌ల టీ20 ఇంటర్నేషనల్స్ సిరీస్‌లో భాగంగా జింబాబ్వేతో నిన్న (శనివారం) జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా పరాజయాన్ని చవి చూసింది. 13 పరుగుల తేడాతో జింబాబ్వే భారత్ పై విజయం సాధించింది. ఈ విజయంతో ఈ సిరీస్‌లో జింబాబ్వే 0-1 తేడాతో ఆధిక్యత సాధించింది. రెండో మ్యాచ్ ఈ రోజు (ఆదివారం) సాయంత్రం 4.30 గంటలకు హరారెలో జరుగనుంది.
తొలుత బ్యాటింగ్ కు దిగిన జింబాబ్వే.. టీమిండియా బౌలర్ల ధాటికి నిలబడలేకపోయింది. 20 ఓవర్లల్లో 9 వికెట్ల నష్టానికి 115 పరుగులు చేశారు. ఓపెనర్ వెస్లీ మధెవెర- 21, కేప్టెన్ సికిందర్ రజా- 17, బ్రియాన్ బెన్నెట్- 22, డియాన్ మేయర్స్- 23, క్లైవ్ మదండే- 29 పరుగులు సాధించారు.
టీమిండియా బౌలర్లలో రవి బిష్ణోయ్ సత్తా చాటాడు. 4 ఓవర్ల కోటాలో 13 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు తీసుకున్నాడు. T20 ఇంటర్నేషనల్స్‌లో బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్ సాధించాడు. వాషింగ్టన్ సుందర్- 2, అవేష్ ఖాన్- 1, ముఖేష్ కుమార్- 1 చొప్పున వికెట్లను పడగొట్టారు.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 102 పరుగులకే ఆల్ అవుట్ అయ్యింది. సికిందర్ రజా, తెండై ఛతారా బౌలింగ్ ధాటికి నిలవలేకపోయింది. బ్యాటింగ్ ఆర్డర్‌లో అన్నీ సింగిల్ డిజిట్ లే కనిపించాయి. ముగ్గురు మినహా మిగిలిన వారెవరూ 10 పరుగులు కూడా చేయలేకపోయారు.
సన్ రైజర్స్ హైదరాబాద్ స్టార్ బ్యాటర్, ఓపెనర్ అభిషేక్ శర్మ డక్ అవుట్ అయ్యాడు. ఇది అతని తొలి టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్. 2024-ఐపీఎల్ లో అతని పర్ఫార్మెన్స్ చూసిన సెలెక్టర్లు ఈ సిరీస్‌కు ఎంపిక చేశారు. కానీ దాన్నిసద్వినియోగం చేసుకోలేకపోయాడు.