Janasena Symbol : అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ప్రధాన పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ప్రత్యర్థులను ఎలా ఇబ్బందులు పెట్టాలా అనే ఆలోచనలు చేస్తున్నాయి. ఎన్నికల్లో గెలవాలంటే సామ,దాన,భేద, దండోపాయాలు ఎన్నింటినో ఉపయోగించాలని తలపండిన రాజకీయ నాయకులు చెబుతూ ఉంటారు. ఒకప్పుడు రాజకీయాలు అనేవి హుందాగా, సాఫీగా సాగేవి. కానీ ఇప్పుడలా కాదుగా.. ప్రత్యర్థులను పతనం చేసైనా అధికారం చేజిక్కించుకునే నేతలు తయారయ్యారు.
ఇక అన్ని పార్టీలు ఎన్నికలకు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటుండగా జనసేనకు మాత్రం మళ్లీ సింబల్ కిరికిరి ఎదురైంది. గాజు గ్లాస్ గుర్తును జనసేన పార్టీకి కేటాయించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. జనసేన కన్నా ముందే తాము గాజు గ్లాస్ గుర్తు కోసం దరఖాస్తు చేసుకున్నామని కోర్టును ఆశ్రయించారు.
రాజమండ్రికి చెందిన రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ సెక్యులర్ పార్టీ అధ్యక్షుడు..2023 డిసెంబర్ 20న గాజు గ్లాస్ గుర్తు కోసం తాము ఈసీకి దరఖాస్తు చేసుకున్నామని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు పిటిషనర్. తమకు కాకుండా తమ తర్వాత దరఖాస్తు చేసిన జనసేన పార్టీకి గాజు గ్లాస్ గుర్తు కేటాయించారని పిటిషన్ లో పేర్కొన్నారు.
తెలుగు రాష్ట్రాల ఎన్నికల సీఈవో లతో పాటు జనసేన పార్టీ అధ్యక్ష, కార్యదర్శలను ప్రతివాదులుగా పేర్కొన్నారు పిటిషనర్. ఈ నేపథ్యంలో విచారణ చేపట్టిన హైకోర్టు గ్లాస్ గుర్తు కేటాయింపు ప్రక్రియకు సంబంధించిన వివరాలను అందించాలని ఆదేశించింది. స్పందించిన ఈసీ గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు ప్రక్రియకు సంబంధించిన వివరాలను అందించాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. స్పందించిన ఈసీ గాజు గ్లాస్ గుర్తు కేటాయింపుపై హైకోర్టుకు వివరణ ఇచ్చింది.
2023 డిసెంబర్ 12న సింబల్ కేటాయింపు ప్రక్రియ మొదలైందని.. అదే రోజున జనసేన పార్టీ తరపున గాజు గ్లాస్ గుర్తు కేటాయించాలని దరఖాస్తు ఇచ్చారని కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. పిటిషనర్ డిసెంబర్ 20న అప్లికేషన్ ఇస్తే..అంతకన్నా ముందు డిసెంబర్ 12న జనసేన నుంచి దరఖాస్తు అందింది కావున ఆ పార్టీకి గాజు గ్లాసు కేటాయించడం జరిగిందని వివరణ ఇచ్చింది ఈసీ. ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు.. జనసేన ఇచ్చిన దరఖాస్తును జత చేస్తూ కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 13వ తేదీకి వాయిదా వేసింది ఏపీ హైకోర్టు.. ఇక ధర్మాసనం ఎలాంటి తీర్పు ఇస్తుందోనని జనసైనికుల్లో ఉత్కంఠ మొదలైంది.