AP Economy : ఐదేళ్ల కింద వంద రూపాయల ఆదాయం ఉండి..ఇప్పుడు కూడా అదే ఆదాయం ఉంటే.. ఆర్థిక పరిభాషలో ఆదాయం తగ్గినట్టే. ఎందుకంటే ఐదేళ్ల కింద ఉండే ధరలు ఇప్పుడు ఉండవు. అప్పట్లో వందకు నాలుగు కేజీల బియ్యం వస్తే ఇప్పుడు కేజీన్నర కూడా రావడం కష్టమే. అంటే ఆదాయం తగ్గినట్టే. ఏపీ ఆర్థిక పరిస్థితి కూడా అంతే. ప్రభుత్వ ఘనకార్యాలతో ఆదాయం పెరుగకపోగా విచ్చలవిడిగా అప్పులు చేస్తూ.. రాష్ట్రాన్ని దివాళా తీయించడానికి సిద్ధం చేశారు.
ఏపీకి సొంత ఆదాయం తగ్గడం, కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్లు రాకపోవడంతో ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిది నెలల్లోనే దివాళా ఛాయలు కనిపించాయి. ఏకంగా రూ.90వేల కోట్ల వరకు లోటు ఉంది. అప్పులు చేస్తున్నా, కేంద్రం నుంచి వస్తున్న నిధులు 50 శాతం వరకే ఉండడంతో దాని ప్రభావం ఎక్కువగానే కనిపిస్తోంది. రిజర్వ్ బ్యాంకు వెల్లడించిన నివేదిక వరకు 12 నెలల కాలానికి గానూ బడ్జెట్ లో ఆమోదించిన గణాంకాలకు, డిసెంబర్ వరకు వచ్చిన గణాంకాలకు మధ్య పొంతన లేదు. ఏడాదికి రూ.2,79,279 కోట్ల ఆదాయం వస్తుందని బడ్జెట్ లో పొందుపరుచగా, తొలి తొమ్మిది నెలల్లో కేవలం రూ.1,88,862 కోట్లు వచ్చినట్టు తేలింది.
కేంద్రం నుంచి రావాల్సిన వాటిలో కోతలు ఉండడం ఖజానాకు సమస్యగా మారింది. ఏడాది మొత్తానికి రూ.46,836 కోట్లు వస్తుందని అంచనా వేసుకున్నప్పటికీ 9నెలల్లో కేవలం రూ.24వేల కోట్లే రావడంతో అధికారులు కంగుతిన్నారు. రుణాలు కూడా అనుకున్న స్థాయి కన్నా ఎక్కువగానే సేకరించుకోవడం గమనార్హం. ఏడాది మొత్తానికి అన్ని రుణాలు కలుపుకుని రూ.49వేల కోట్లు సేకరించాలని నిర్ణయించగా.. ఇప్పటికే రూ.69,716 కోట్లు సేకరించారు. కాగా, ఏటా లక్ష కోట్ల రూపాయలు ఖాయంగా తీసుకుంటున్నారు. అప్పుల కోసమే ఆదాయంలో సగానికి పైగా కట్టాల్సి వస్తోంది. ఆర్బీఐకి చాలా అప్పుల వివరాలు ఇవ్వడం లేదనే ఆరోపణలు ఏపీ సర్కార్ పై వస్తున్నాయి.