Olympic Games : అట్టహాసంగా ఒలింపిక్స్ క్రీడలు ప్రారంభం.. వినూత్న రీతిలో వేడుకలు
Olympic Games : పారిస్ ఒలింపిక్స్ అధికారికంగా ప్రారంభమయ్యాయి. చరిత్రలో తొలిసారి నదిలో జరిగిన సంబరాలు చిరస్మరణీయం. ఈఫిల్ టవర్ సమీపాన చారిత్రక ‘ట్రొకార్డో’ వద్ద ప్రారంభమైన పరేడ్ సెన్ నదీ తీరం వెంట సాగింది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయెల్ మాక్రాన్, ఐఓసీ అధ్యక్షుడు థామస్ బాగ్ తో పాటు దాదాపు 100 దేశాలకు చెందిన ప్రతినిధులు ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. అన్నింటి కంటే ముందు సెన్ నదిపై ఉన్న పాంట్ డి ఆస్టర్ లిజ్ బ్రిడ్జిపై ఫ్రాన్స్ జాతీయ పతాకంలోని ఎరుపు, తెలుపు, నీలి రంగులను వెదజల్లుతూ నయనానందకరంగా కార్యక్రమం మొదలైంది.
‘ఎన్ చాంట్’ (మిమ్మల్ని కలవడం చాలా ఆనందంగా ఉంది) అంటూ ఫ్రెంచ్ భాషలో నినాదంతో పడవలపై ఆటగాళ్ల పరేడ్ మొదలైంది. ఎప్పటిలాగే తొలి ఒలింపిక్స్ కు వేదికైన గ్రీస్ బృందం అందరికంటే ముందుగా రాగా, ఐఓసీ శరణార్థి టీం దానిని అనుసరించింది. ఫ్రెంచ్ అక్షరమాలలో జట్లు వరుసగా వచ్చాయి. బోట్లు వెళుతున్న సమయంలో ఫ్రెంచ్ సంగీతాన్ని నేపథ్యంలో వినిపించారు. అనంతరం ప్రఖ్యాత పాప్ సింగర్ లేడీ గాగా తన ఆటపాటతో అలరించింది. వర్చువల్ కు వాస్తవాన్ని జతచేసి ఈ వేడుకలను కొనసాగించిన విధానం గురించి ఎంత చెప్పినా తక్కువే. నదికి రెండు వైపులా కళాకారుల ప్రదర్శనలు, విన్యాసాలు కొనసాగాయి. జ్యోతితో ముసుగు వ్యక్తి పారిస్ లోని ప్రత్యేకతలన్నింటినీ ప్రపంచానికి చాటేలా ప్రయాణం కొనసాగించాడు. గాల్లో నుంచి తాడు సాయంతో ఎగురుతూ వెళ్లి నది దాటాడు. అతను ఒక్కో విశిష్టమైన ప్రదేశానికి వెళ్లినప్పుడల్లా ఆకట్టుకునే ప్రదర్శనలు అలరించాయి.
పరేడ్ లో భారత్ అథ్లెట్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు, టేబుల్ టెన్నిస్ దిగ్గజం శరత్ కమల్ పతాకధారులుగా వ్యవహరించారు. ఈ ఇద్దరు త్రివర్ణ పతాకాన్ని పట్టుకుని ముందు నిలబడగా, వీరి వెనకాల మన అథ్లెట్ల పడవ సాగిపోయింది. సంప్రదాయ భారతీయ దుస్తుల్లో తెలుపు రంగుపై త్రివర్ణ పతాకంలోని మరో రెండు వర్ణాలతో రూపొందించిన చీరలను మహిళలు.. కుర్తా, పైజామాను పురుషులు ధరించారు. భారత బృందం నుంచి అథ్లెట్లు, ప్రతినిధులు కలిపి 78 మంది పరేడ్ లో పాల్గొన్నారు.