IPL 2024 : ఐపీఎల్ అంటేనే ఫుల్ ఎంటర్ టైన్ మెంట్. ఇక అందులో మన అభిమాన ఆటగాడు దుమ్ముదులిపితే ఎంత మజా వస్తుంది. ఇక ఈ ఐపీఎల్ సీజన్ లో అందరి చూపు ఆ ఒక్కడి గురించే. ఆ ఒక్కడే రిషబ్ పంత్. 2022 డిసెంబర్ చివర్లో రోడ్డు ప్రమాదం నుంచి అదృష్టవశాత్తు అతడు ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ఘటన కారణంగా గాయాలపాలైన అతడు ఎన్నో ఆపరేషన్లు చేయించుకున్నాడు. ఈ కారణంగా నిరుడు ఐపీఎల్ ఆడలేదు. కెరీర్ ను ప్రమాదంలోకి నెట్టిన ఘటన నుంచి కోలుకుని ఫిట్ నెస్ కూడా సాధించాడు. కెప్టెన్ గా ఢిల్లీని నడిపించబోతున్నాడు. అతడు ఎలా ఆడుతాడో? అనే విషయంపై అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇక పేస్ బాస్ బుమ్రా లేని ముంబై ఇండియన్స్ ను ఊహించుకోవడం చాలా కష్టం. గతేడాది బుమ్రాకు వెన్నెముక గాయం కారణంగా ఆడలేదు. ప్రపంచకప్ కు బుమ్రాను సిద్ధం చేయడంపై అప్పుడు బీసీసీఐ ప్రత్యేక దృష్టి పెట్టింది. తిరిగి జట్టులోకి వచ్చి ఆ ప్రపంచ కప్ లో 20 వికెట్లతో జట్టు ఫైనల్ చేరడంలో కీలకపాత్ర పోషించాడు. ఇప్పుడదే జోష్ తో ముంబై జట్టును విజయాల వైపు నడిపించేందుకు వచ్చేస్తున్నాడు.
బుమ్రా లాగే శ్రేయస్ అయ్యర్ కు కూడా వెన్నెముక గాయం వేధించింది. ఆపరేషన్ కారణంగా 2023 ఐపీఎల్ ఆడలేదు. నిరుడు వన్డే ప్రపంచ కప్ లో ఆకట్టుకున్నాడు. బీసీసీఐ చెప్పినా దేశవాళీ టోర్నీలో ఆడలేదని వార్షిక కాంట్రాక్టుల జాబితా నుంచి శ్రేయస్ పేరును తొలగించడం పెద్ద దుమారమే రేపింది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ లో తన సత్తా చాటాలని తహతహలాడుతున్నాడు. కెప్టెన్ గా కోల్ కతా నైట్ రైడర్స్ ను నడిపించాలని టార్గెట్ గా పెట్టుకున్నాడు.
వీరే కాదు ఇంకా ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్, కేన్ విలయమ్సన్, బెయిర్ స్టో తదితరులు ఈ ఐపీఎల్ సీజన్ లోకి రీ ఎంట్రీ ఇస్తున్నారు. మరి ఈ కమ్ బ్యాక్ హీరోలు సత్తా చాటుతారా? వినోదాలు పంచుతారా చూడాలి.