AP Politics : ఏపీలో ఆ నాయకుల అనర్హత వేటుకు రంగం సిద్ధం! ఆ నలుగురితో పాటు!!
AP Politics : ఆంధ్రప్రదేశ్ సాధారణ ఎన్నికలు సార్వత్రిక ఎన్నికలతో కలిసి నిర్వహించేందుకు ఈసీ రంగం సిద్ధం చేస్తుందని తెలుస్తోంది. అసెంబ్లీకి ఏప్రిల్ 16న ఎన్నికలు నిర్వహించాలని రిఫరెన్స్ డేట్‌గా ఈసీ నిర్ణయించినట్లు సమాచారం. దీంతో ఏపీ రాజకీయాలు వేగంగా మలుపుతిరుగుతున్నాయి.
ఈ ఎన్నికలు రాజ్యసభ పోరు పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా మారుతోంది. టీడీపీ ఎమ్మెల్యే గంటా రాజీనామాను స్పీకర్ ఆమోదించారు. ఇదే సమయంలో టీడీపీ, వైసీపీ నుంచి ఫిరాయించిన ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు ఇచ్చారు. వారిపై చర్యలు తీసుకుంటారని తెలుస్తోంది. దీంతో, వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన నలుగురితో పాటుగా ఎవరి పైన అనర్హత వేటు వేస్తారనేది చర్చగా మారుతోంది.
ఉత్కంఠ పోరు..
అసెంబ్లీ ఎన్నికల వేళ రాజ్యసభ పోరు ఉత్కంఠతను పెంచుతోంది. ఏపీ నుంచి ఖాళీ కానున్న 3 సీట్లకు వచ్చే నెలలో షెడ్యూల్ రాబోతోంది. అసెంబ్లీ కంటే ముందే రాజ్యసభ ఎన్నికలు ఉంటాయి. ఖాళీ అయ్యే 3 స్థానాలు వైసీపీకి దక్కాల్సి ఉంది. అయితే, వైసీపీలో ఎన్నికల్లో సీట్ల నిరాకరణ.. కొత్త వారికి అవకాశంతో సీట్లు దక్కని వారిని తమ వైపునకు తిప్పుకొనేందుకు టీడీపీ ప్రయత్నిస్తోందని వైసీపీ గుర్తించింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో 4 వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు టీడీపీకి అనుకూలంగా ఓటు వేయడంతో టీడీపీ అభ్యర్థి విజయం సాధించారు. ఈ సారి అలాంటి అవకాశం ఇవ్వద్దని వైసీపీ భావిస్తోంది.
వ్యూహ ప్రతి వ్యూహాలు..
టీడీపీకి 23 మంది సభ్యుల బలం ఉంది. కానీ, అందులో నలుగురు వైసీపీ వైపునకు వెళ్లారు. గంటా రాజీనామా ఆమోదించారు. ఇదే సమయంలో వైసీపీ నుంచి నలుగురు టీడీపీకి వైపునకు వెళ్లారు. వారి పైన అనర్హత వేటు దిశగా చర్యలు తీసుకోబోతున్నారు. వైసీపీ ఫిర్యాదుతో ఆ నలుగురికి స్పీకర్ నోటీసులు జారీ చేశారు. ఇదే సమయంలో టీడీపీ నుంచి వెళ్లిన నలుగురికి టీడీపీ ఫిర్యాదు ఆధారంగా నోటీసులిచ్చారు. జనసేన కూడా వారి పార్టీకి ఉన్న ఏకైక ఎమ్మెల్యేపై ఇలాంటి ఫిర్యాదే చేసింది. వీరిపై అనర్హత వేటు వేయాలని పార్టీలు స్పీకర్ ను కోరాయి. మొత్తం తొమ్మిది మందిపై చర్యలు తీసుకునేందుకు స్పీకర్ సిద్ధంగా ఉన్నారు. కేవలం వైసీపీకే అనుకూలంగా వ్యవహరిస్తే ఎన్నికల వేళ ప్రతిపక్షాల విమర్శలకు అవకాశం ఇచ్చిన వారిమి అవుతామని ఇరు వైపులా వేటు తప్పదని తెలుస్తోంది.
వేటు తప్పదా..
2024 ఎన్నికల్లో వైసీపీలో సీట్లు దక్కని వారు తమకు అనుకూలంగా మారుతారని టీడీపీ భావిస్తోంది. అయితే వారి విషయంలో వైసీపీ ఆచితూచి వ్యవహరిస్తోంది. ఇప్పుడున్న లెక్కల ప్రకారం 10 మందిపై వేటు పడితే సభలో సభ్యుల సంఖ్య 165కి చేరుతుంది. ముగ్గురు రాజ్యసభ సభ్యులను గెలిపించుకునేందుకు ఒక్కో సభ్యుడికి 55 మంది మద్దతు అవసరం. ఈ సారి టీడీపీకి ఒక్క సీటు లేకుండా.. మూడు సీట్లు గెలుచుకోవడం ద్వారా రాజ్యసభలో టీడీపీకి ప్రాతినిధ్యం లేకుండా చేయాలనేది వైసీపీ వ్యూహం. దీనికి అనుగుణంగా ఇప్పుడు వైసీపీ పావులు కదుపుతోంది. అసెంబ్లీ ఎన్నికల ముందే ఏపీలో జగన్ వర్సెస్ చంద్రబాబు రాజ్యసభ రాజకీయం ఆసక్తిగా మారుతోంది.