Spanish church Selling Plots : ప్రస్తుతం రియల్ ఎస్టేట్ వ్యాపారం జోష్ మీద ఉంది. వ్యాపారులకు లాభాల పంట పండిస్తోంది. వేలు, లక్షలు పెట్టి కొనుగోలు చేసిన భూములు.. అమ్మేటప్పుడు కోట్లు పలుకుతాయి. దీంతో చాలా మంది కష్టపడి డబ్బులు సంపాదించి దాచుకుని, అప్పు చేసి మరీ భూములు, ప్లాట్లు కొనుక్కుంటూ ఉంటారు. నగరాలు, పట్టణాలు, గ్రామాలు అనే తేడా లేకుండా ఎక్కడ భూములు దొరికితే అక్కడే కొసేస్తుంటారు. ఈ క్రమంలోనే చంద్రుడిపై కూడా ప్లాట్లు అమ్మకాలు జరిగాయి. ఇప్పుడు మాత్రం ఇంకాస్త ఓ అడుగు ముందుకు వేసి.. ఏకంగా స్వర్గంలోనే భూములు విక్రయిస్తున్నారు. వీటికి సంబంధించిన బ్రోచర్లు కూడా పంచుతున్నారు. అసలు స్వర్గంలో భూములు ఎవరు అమ్ముతున్నారు. వాటిని ఎలా కొనుగోలు చేయాలి అనే ప్రశ్నలు విన్న ప్రతీ ఒక్కరి మదిలో తలెత్తున్నాయి.
స్పెయిన్‌లోని ఓ చర్చి స్వర్గంలో ఫ్లాట్లను విక్రయించడం మొదలుపెట్టింది. సోషల్ మీడియాలో కొందరు ఇన్‌ఫ్లూయెన్సర్లు తెలిపిన వివరాల ప్రకారం.. ఆ చర్చి పాస్టర్ ఇంటోమ్స్.. స్వర్గంలో ఉన్న భూముల అమ్మకాలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఇంటోమ్స్ అనే పాస్టర్.. తాను 2017లో దేవుడితో మాట్లాడినట్లు తెలుస్తోంది. స్వర్గంలో చదరపు మీటరు స్థలానికి 100 డాలర్లు అంటే మన భారత కరెన్సీలో దాదాపు రూ.8 వేలకు విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. అంటే దాదాపు స్వర్గంపై ఎకరం భూమి కొనాలంటే దాదాపు రూ.32 కోట్లు చెల్లించాలన్న మాట. ఈ ధర హైదరాబాద్‌లోని భూముల ధరకంటే తక్కువగా ఉండడం గమనార్హం. అయితే ఈ ప్లాట్లలో కొన్ని స్వర్గానికి అధిపతి అయిన ఇంద్రుడి నివాసానికి పక్కనే అమ్ముతున్నట్లు చెప్పారు.
మరోవైపు.. స్వర్గంలో ప్లాట్ల విక్రయానికి సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన బ్రోచర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మేఘాలలో నిర్మించిన ఓ ఇల్లు ఉండగా.. దాని వెనుక నుంచి వచ్చే బంగారు కిరణాలతో ఉంది. అందులో నలుగురు సభ్యులతో కూడిన కుటుంబం భూమి నుంచి ఆకాశంలో ఉన్న ఆ ఇంటికి కలుపుతూ ఉన్న మెట్ల వద్ద నిలబడి ఉన్నట్లు ఉంది. ఇక స్వర్గంలోని ప్లాట్లు కొనుగోలు చేసేవారికి ఆ పాస్టర్ బంపర్ ఆఫర్ ప్రకటించారు.
అన్ని రకాల క్రెడిట్, డెబిట్ కార్డులైన వీసా, మాస్టర్, మాస్ట్రో, అమెరికన్ ఎక్స్‌ప్రెస్, రూపే కార్డులతో చెల్లింపులు చేయవచ్చని వివరించారు. అంతేకాకుండా యూపీఐ యాప్స్ అయిన గూగుల్ పే, యాపిల్ పే వంటి డిజిటల్ వ్యాలెట్‌లతోనూ డబ్బులు చెల్లించవచ్చని పేర్కొన్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇన్‌స్టాల్‌మెంట్ పద్దతిలో కూడా ప్లాట్లకు డబ్బులు కట్టే సదుపాయాన్ని కూడా కల్పించారు. దీంతో కొంతమంది జనాలు ఇది నమ్మి వేల డాలర్లు పోసి స్వర్గంలో ప్లాట్లు కొన్నట్లు తెలుస్తోంది.