Hari Hara Veera Mallu : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నాయకుడిగా వస్తున్న సినిమా ‘హరి హర వీర మల్లు’. ప్రస్తుతం ఉన్న సినిమాల్లో ఈ సినిమాపైనే పవన్ అభిమానులు ఎక్కువగా హోప్స్ పెట్టుకున్నారు. ఈ మూవీ మొదలైనప్పటి నుంచి గండాలను ఎదుర్కొంటోంది. సినిమాను భారీ బడ్జెట్ తో తీసుకురావాలని ఎంఎం రత్నం ప్లాన్ చేశారు. అందుకు తగ్గట్లుగానే అన్నీ సమకూర్చుకున్నారు. కానీ పదే పదే బ్రేకులు పడుతూనే ఉన్నాయి.
పవన్ కళ్యాణ్ 2024 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ సినిమా మొదలైంది. ఓజీ, బ్రో తదితర సినిమాల కారణంగా హరి హర వీర మల్లుకు కొన్నే డేట్స్ ఇచ్చారు పవన్. అవి కాస్తా పూర్తయిన తర్వాత ప్రచారంలో బిజీగా మారారు. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పాటు, డిప్యూటీ, మంత్రి హోదా ఇలా చక చకా జరిగిపోయాయి. ఇవన్నీ జరిగే వరకు వేచి ఉన్న మేకర్స్ గత నెలలో పవన్ కళ్యాణ్ ను కలిశారు. ఆయన ఈ మూవీకి సరిపడా డేట్లు ఇస్తానని హామీ ఇచ్చారు.
దీంతో, పవన్ కళ్యాణ్ రీసెంట్ గా హరి హర వీరమల్లు పార్ట్ 1 షూటింగ్ ను తిరిగి పునఃప్రారంభించారు. ఆయన సౌలభ్యం విజయవాడలో తాత్కాలిక స్టూడియో ఏర్పాటు చేశారు. ఎప్పటిలాగే పవన్ కళ్యాణ్ సినిమా నిర్మాణాన్ని నిలిపివేశారు. ఆయన మరోసారి తన రాజకీయ, మంత్రి పదవులతో బిజీ అయ్యారు. కేవలం రెండు, మూడు రోజులు మాత్రమే హరి హర వీర మల్లు చిత్రీకరణలో పాల్గొనడం మినహా ఆయన పెద్దగా పాల్గొనలేదు.
పవన్ కళ్యాణ్ వర్కింగ్ స్టయిల్ గురించి బాగా తెలిసిన నిర్మాత ఎఎం రత్నం ఇందుకు సిద్ధమయ్యారు. దాదాపు నాలుగేళ్లుగా ఈ సినిమా నిర్మాణంలో ఉంది. వరుస వాయిదాలతో విసిగిపోయిన దర్శకుడు క్రిష్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు. రత్నం తనయుడు జ్యోతికృష్ణ ఇటీవలే దర్శకుడిగా బాధ్యతలు తీసుకొని ముందుకు కదిలించారు. అయితే పవన్ కళ్యాణ్ తిరుమల ఇష్యూపై ఫోకస్ పెట్టడంతో చిత్రీకరణ మరోసారి వెనక్కి తగ్గింది.