Ugram Rifle : ఒక దేశం ప్రగతిపథంలో దూసుకెళ్లాలంటే..ఆ దేశం శాంతిభద్రతలు, సరిహద్దు రక్షణ చర్యలు సమర్థవంతంగా నిర్వహించాలి. దేశంలో శాంతియుత పరిస్థితులు ఉన్నప్పుడే పెట్టుబడి దారులు, పారిశ్రామిక వేత్తలు పెట్టుబడులు పెట్టి కంపెనీలు స్థాపిస్తారు. తద్వారా వస్తు ఉత్పత్తి జరిగి దేశానికి ఆదాయం వస్తుంది. అలాగే దేశ పౌరులకు ఉపాధి కల్పన జరిగి వారికి ఆదాయం వస్తుంది. శాంతిభద్రతలు బాగుంటేనే దేశ పౌరులు స్వేచ్ఛగా సంచరించగలుగుతారు.తమ పనులు చక్కగా చేసుకోగలుగుతారు. దీంతో జీవన ప్రమాణాలు పెరుగుతాయి. ఇవన్నీ సాధ్యం కావాలంటే దేశంలో సమర్థవంతమైన రక్షణ, భద్రతా బలగాలు ఉండాలి. వారి చేతుల్లో అత్యాధునిక ఆయుధాలు ఉండాలి. భారత్..శాంతిభద్రతలు, సరిహద్దు రక్షణలో పకడ్బందీ చర్యలు తీసుకుంటోంది. మోదీ అధికారంలోకి వచ్చాక వీటికి నిధులు కూడా పెంచారు.
ఇక తాజాగా భద్రతా బలగాల చేతికి మరో సరికొత్త ఆయుధం అందించారు. స్వదేశీ పరిజ్ఞానంతో ‘ఉగ్రం’ పేరుతో తయారుచేసిన రైఫిల్(ఉగ్రామ్ రైఫిల్) ప్రొటోటైప్ ను రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్డీవో) రూపొందించింది. డీఆర్డీవోకు చెందిన ‘ఆర్మమెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఎస్టాబ్లిష్ మెంట్’, హైదరాబాద్ ఆధారిత ప్రైవేట్ సంస్థ ‘ద్వీపా ఆర్మర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్’ లు కలిసి దీన్ని కేవలం 100రోజుల్లోనే రూపొందించింది. త్వరలోనే ట్రయల్ లు ప్రారంభించనున్నారు. అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లో దీన్ని పరీక్షిస్తామని ఏఆర్డీఈ డైరెక్టర్ చెప్పారు.
7.62 ఎంఎం కాలబర్ తో ‘ఉగ్రం’ రైఫిల్ రూపకల్పన చేశారు. సాయుధ దళాలు ప్రముఖంగా వినియోగించే ఇన్సాస్ రైఫిల్ కాలిబర్ (5.62 ఎంఎం)తో ఇది ఎక్కువ. నాలుగు కీలోల లోపెడ్ బరువున్న ఆయుధాన్ని 500 మీటర్ల పరిది వరకు ఉపయోగించవచ్చు. ఆటోమెటిక్, సింగిల్ మోడ్ లలో పనిచేసే ఈ రైఫిల్ తో 20 రౌండ్ల వరకు ఫైర్ చేయవచ్చు. పారా మిలిటరీ, పోలీస్ బలగాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని దీన్ని తయారుచేశారు. కాగా, ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చేసిన ఆయుధం ఇదే కావడం విశేషం.