Puri Jagannath : ఒడిశాలోని పూరీ జగన్నాథుడి రహస్య గది తలుపు రేపు (గురువారం) తెరుచుకోనున్నాయి. గురువారం ఉదయం 9.51 నుంచి 12.15 గంటల వరకు శుభముహూర్తంగా నిర్ణయించారు. శ్రీక్షేత్ర కార్యాలయంలో మంగళవారం భాండాగారం అధ్యయన సంఘం అధ్యక్షుడు జస్టిస్ బిశ్వనాథ్ రథ్ నేతృత్వంలో నిర్వహించిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
సమావేశానంతరం జస్టిస్ బిశ్వనాథ్ రథ్, ఆలయ పాలనాధికారి అరవింద పాడి విలేకరులతో మాట్లాడారు. ‘ఈ నెల 14న భాండాగారంలోని తొలి రెండు గదుల్లో ఉన్న పురుషోత్తముని సంపద బయటకు తీసి తాత్కాలిక స్ట్రాంగ్ రూంకు తరలించాం. ఇదంతా వీడియోగ్రఫీ చేయించాం. ఈనెల 18న రహస్య గదిని తెరిచి, అందులోని సంపదను మరో తాత్కాలిక స్ట్రాంగ్ రూంలో భద్రపరుస్తాం. అనంతరం ఈ భాండాగారాన్ని పురావస్తు శాఖకు మరమ్మతుల నిమిత్తం అప్పగిస్తాం. పనులు పూర్తయ్యాక సంపదనంతా మళ్లీ రహస్య గదికి తెచ్చి, ఆభరణాల లెక్కింపు చేపడతాం’ అని వారు తెలిపారు. రహస్య గది తెరుస్తున్న కారణంగా శ్రీక్షేత్రంలోకి గురువారం ఉదయం నుంచి భక్తుల ప్రవేశాన్ని నిలిపివేసినట్లు ఆలయ పాలకమండలి అని ఒక ప్రకటనలో వెల్లడించింది.