AP Assembly : తెరుచుకున్న ఏపీ అసెంబ్లీ రెండో గేటు.. గోడను కూల్చివేయించిన స్పీకర్
AP Assembly : ఏపీ అసెంబ్లీలో మూసివేసిన రెండో నెంబరు గేటు తెరుచుకుంది. గత ప్రభుత్వ హయాంలో వాస్తు పేరు చెప్పి రెండో గేటును మూసివేశారు. గేటు దగ్గర గోడ నిర్మించి రాకపోకలు నిలిపివేశారు. దీంతో అసెంబ్లీ గేటు-2 గోడను స్పీకర్ అయ్యన్నపాత్రుడు కూల్చివేయించారు. గేటు-2 నుంచి ఎవరూ రాకుండా జగన్ కట్టిన గోడని తొలగించి, గేటుని తెరిపించారు. రాకపోకలకు అనువుగా మార్గాన్ని సిద్ధం చేశారు. అమరావతి రైతులు తమకి జరిగిన అన్యాయానికి ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసనలు, ఆందోళనలు చేస్తుంటే జగన్ మోహన్ రెడ్డి గేటు-2 మూసి, గోడ కట్టించారని మండిపడ్డారు.
ప్రజలు తమ సమస్యలు చెప్పుకునే అవకాశం కల్పించడం ప్రభుత్వ కనీస బాధ్యత అని అయ్యన్నపాత్రుడు స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో దేవాలయంగా భావించే శాసనసభ గేట్లు తెరిచే ఉండాలన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ప్రజాస్వామ్య ప్రభుత్వం ఉందని అన్నారు. కూటమి ప్రభుత్వం ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటుందని అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు.