Gandikota : రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఉదయం 8గంటలకే భానుడు భయపెడుతున్నాడు. దీంతో బయటకు రావాలంటేనే వెన్నులో వణుకు పుడుతోంది. ఇప్పటికే తెలంగాణలో 42 డిగ్రీలుగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలు.. రానున్న మరో రెండు మూడు రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఎండ తీవ్రత, వడగాలుల సమయంలో విపత్తు నిర్వహణ శాఖ అధికారులు పలు కీలక సూచనలు చేశారు. అవసరమైనతే తప్ప బయటకు రావొద్దని సూచిస్తున్నారు. ఇటీవల బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి తెలుగు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు పడ్డాయి. నిన్నటి వరకు తెలుగు రాష్ట్రాలు చల్లబడ్డా.. ఇప్పట్లో వర్షాలు లేనట్లే అంటున్నారు. రాబోయే రోజుల్లో ఎండలు ముదిరిపోయే సూచన కనిపిస్తుందని ఐఎండీ అధికారులు తెలిపారు. వానలు సరిగా లేకపోవడంతో పలు చెరువులు, కాల్వలు నీళ్లు లేక ఎండిపోయాయి.
ప్రముఖ పర్యాటక ప్రాంతమైన వైఎస్సార్ జిల్లాలోని గండికోటలో వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఎర్రకోనేరు చుక్క నీరు లేకుండా ఎండిపోయింది. 900 ఏళ్ల చరిత్ర కలిగిన గండికోటలో ఈ కోనేరు కూడా అంతే పురాతనమైంది. తమ తరతరాల కాలం నుంచి ఈ కోనేరు ఎండిపోయిన ఆనవాళ్లు చూడలేదని ఆ గ్రామస్తులు చెబుతున్నారు. ప్రస్తుత కరువు పరిస్థితులకు ఎండిపోయిన ఈ కోనేరు అద్దంపడుతోందని పలువురు పేర్కొంటున్నారు. గండికోట కోనేరు ఎండిపోయిందంటేనే ఎండలు ఎంత తీవ్రంగా ఉన్నాయో తెలియజేస్తోందంటున్నారు. ఈ విషయమై జిల్లా పురావస్తుశాఖ అధికారి బాలకృష్ణను వివరణ కోరగా.. వానలు సకాలంలో కురవక పోవడంతోనే కోనేరులో నీరు ఎండిపోయిందని, పూడికతీత, మరమ్మతు పనుల అంశాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.