YS Jagan : తిరుమల పవిత్రతను, శ్రీవారి ప్రసాదాన్ని రాజకీయం చేస్తున్నారని మాజీ సీఎం జగన్ ఆరోపించారు. తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనం రద్దు చేసుకున్న అనంతరం మాజీ సీఎం విలేకరులతో మాట్లాడారు. తన పర్యటనను అడ్డుకున్న ఏపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ‘‘ఇలాంటి పరిస్థితి రాజకీయ జీవితంలో చూడలేదు. దేవుడి దర్శనానికి వెళ్తుంటే అడ్డుకునే ప్రయత్నం చేయడం దారుణం. ఇలాంటి పరిస్థితులు దేశంలోనే ఎప్పుడూ చూడలేదు. ఏపీలో రాక్షస రాజ్యం నడుస్తోంది.
నా తిరుమల పర్యటనకు అనుమతి లేదని వైసీపీ వాళ్లకు నోటీసులు ఇచ్చారు. పక్క రాష్ట్రాల నుంచి కూడా తిరుమలకు బీజేపీ వాళ్లు వస్తున్నారు. తిరుమల లడ్డూ వ్యవహారంలో చంద్రబాబు చెప్పేవన్నీ అబద్దాలు. జరగని విషయాన్ని జరిగినట్లు కల్తీ నెయ్యి అంటూ అబద్దాలు చెప్తున్నారు. తిరుపతి లడ్డూ అంశాన్ని పక్కదారి పట్టించేందుకు డిక్లరేషన్ అంశాన్ని తీసుకు వచ్చారు. కూటమి వంద రోజుల పలనను డైవర్ట్ చేయడానికే తిరుపతి లడ్డూ వ్యవహారం తెరపైకి తెచ్చారు. సాక్షాత్తూ సీఎం దగ్గరుండి తిరుమలను అపవిత్రం చేయిస్తున్నారు. టీటీడీలో నెయ్యి కొనుగోలు ప్రక్రియ దశాబ్దాలుగా జరుగుతోంది. దాన్నేమీ మేము మార్చలేదు. టీటీడీలో తప్పు చేయాలన్నా తప్పులేని వ్యవస్థ ఉంది. ఏ నిర్ణయమైనా సభ్యులు అందరూ కలిసి తీసుకుంటారు’’ అని వైఎస్ జగన్ చెప్పారు.