Sakshi : రంగు మార్చిన ‘సాక్షి’.. ఉన్నపళంగా ఇలా చేసిందేంటి?
Sakshi : తెలుగు రాష్ట్రాల్లో మీడియా ఎంతో పవర్ ఫుల్ అని తెలిసిందే. ఇప్పటికీ చాలా మంది మీడియాలో ఏది వస్తే అదే నిజం అనుకునేవారు ఉన్నారు. రాజకీయాల్లో మనుగడ సాగించాలంటే కచ్చితంగా రాజకీయ పార్టీలకు పత్రికలు, టీవీ చానల్స్ ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాజకీయాలను శాసించేంది పత్రికా రంగమేనని కొత్తగా చెప్పాల్సిన పని లేదు.
1980 దశకంలో కాంగ్రెస్ పార్టీని గద్దె దించి ఎన్టీఆర్ సీఎం కావడానికి ఈ పత్రికలే దోహదం చేశాయి. ఆ తర్వాత ఎన్టీఆర్ ను గద్దె దించి చంద్రబాబును సీఎం చేసిన ఘనత పత్రికలు, టీవీలకే దక్కుతుంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రతీ పార్టీకి ఒక చానల్, పత్రిక ఉన్నాయి. అయితే ఈ విషయంలో టీడీపీ ముందుండేది. ఆ తర్వాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయాలకు పత్రికలు, టీవీలకు అవినాభావ సంబంధం ఉందని గుర్తించి తనకు కూడా ఓ టీవీ, పత్రిక ఉండాలని భావించారు. అలా వచ్చిందే సాక్షి టీవీ, పత్రిక. సాక్షి టీవీని 2009 మార్చి 1న ఇందిరా టెలివిజన్ లిమిటెడ్ గ్రూప్ ప్రారంభించింది. దీనికి వైఎస్ కుటుంబమే యజమాని.
అప్పటి నుంచి వైఎస్ నేతృత్వంలోని సాక్షి టీవీ కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతుగా టీడీపీకి వ్యతిరేకంగా వార్తలు ప్రచారం చేస్తూ వచ్చింది. 2009 ఎన్నికల్లో వైఎస్ పై టీడీపీ అనుకూల పత్రికలు దాడి చేస్తే సాక్షి టీవీ ప్రతిదాడి చేసింది. ఇలా వైఎస్ రెండో సారి అధికారంలోకి రావడానికి సాక్షి టీవీ, పత్రికలు ఎంతో దోహదపడ్డాయి. ఇక ఆ తర్వాత ఆయన మరణం, జగన్ కాంగ్రెస్ ను వదిలిపెట్టి సొంత పార్టీ పెట్టుకోవడం, 2014 ఎన్నికల్లో ఓడిపోవడం, 2019 లో గెలవడం..ఈ ముఖ్య ఘటనలన్నింటినీ సాక్షి టీవీ జగన్ కు, జగన్ పార్టీకి అండగా నిలిచాయి.
అయితే గత పదహేను ఏళ్లుగా లేనిది..సాక్షి టీవీ తన రూపును మార్చుకుంది. అప్పటిదాక ఒకే రకమైన కలర్ , లోగోలతో వచ్చి సాక్షి టీవీ తాజాగా వైసీపీ జెండా కలర్ లో ఒకటైన పాలపిట్ట కలర్ లోకి మారిపోయింది. మొత్తానికైతే సాక్షి కొత్త లుక్ లో కనిపిస్తోంది. అయితే ఎన్నికల వేళ ఈ మార్పు ఎందుకు చేశారా? అని అందరూ ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. అయితే పార్టీ జెండా కలర్ ఉండడంతో ఇక మరింత పక్కాగా వైసీపీ జెండాను మోసేందుకు సాక్షి రెడీ అయిపోయిందని కొందరు కామెంట్ చేస్తున్నారు. మరికొందరైతే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గుర్తులను చెరిపివేసే ప్రయత్నం అని అంటున్నారు. ఇటీవల వైఎస్ షర్మిల కూడా సాక్షి టీవీలో తనకూ వాటా ఉందని చెప్పారు. అయితే సాక్షి టీవీ తనదే అని చెప్పుకోవడానికి ఈ కొత్త రూపు తీసుకొచ్చారు కావొచ్చు అని మరికొందరు భావిస్తున్నారు. ఏదేమైనా ‘సాక్షి రంగు మార్చింది’ అని చెప్పవచ్చు.