JAISW News Telugu

Road to Heaven : స్వర్గానికి రోడ్డు మార్గం.. భారతంలో చెప్పబడిన నిగూఢ రహస్యమిది!

Road to Heaven

The Road to Heaven

Road to Heaven : ప్రపంచంలోనే భారత సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాలకు, నమ్మకాలకు విశిష్ట ప్రత్యేకత ఉంది. ఇక్కడి ప్రజల జీవనవిధానంలో అణువణునా వేదాలు, పురాణాల పాత్ర ఎక్కువ. హైందవ సంప్రదాయంలో ఎన్నో విజ్ఞాన అంశాలు, విశేషాలతో కూడుకున్నది. ఇక భగవద్గీత వేళ సంవత్సరాల కిందనే ఒక పర్సనాలిటీ డెవలప్ మెంట్ గ్రంథంగా చెప్పవచ్చు. మనిషి జీవనానికి సంబంధించిన అన్నీ అంశాలు ఇందులో పొందుపరుచబడ్డాయి. అందుకే భారతీయుల మనస్సులో ‘గీత’కు చాలా ప్రాధాన్యం ఉంటుంది. అలాగే మహా భారతం ఐదో వేదంగా ప్రసిద్ధి పొందింది. దానిలో ఉన్న అంశాలు ప్రపంచంలోనే మరే గ్రంథంలోనూ ఉండవనే చెప్పాలి. అందులో చెప్పబడిన స్వర్గానికి చేరుకునే మార్గం గురించి చెప్పబడింది. దాన్న ‘స్వర్గారోహిణి’ అని కూడా అంటారు. దాన్ని ఎలా చేరుకోవాలో తెలుసుకుందాం..

భూమి నుంచి స్వర్గానికి చేరుకోడానికి ఏకైక మార్గం భారతదేశ ఆఖరి గ్రామం.. బద్రీనాథ్ క్షేత్రం నుంచి 4 కి.మీ. దూరంలో ఉండే చిన్న గ్రామం మాన. ఈ గ్రామం చివర నుంచి సరస్వతి నది కొంత దూరం ప్రవహించాక అలకనంద నదిలో కలిసి అంతర్వాహినిగా
ప్రవహిస్తుంది. ఇక్కడే సరస్వతీమాత ఆలయం కూడా ఉంటుంది. పాండవులు ఈ మార్గం ద్వారానే స్వర్గానికి చేరుకున్నారని ప్రతీతి.

ఈ సరస్వతి నది పక్కన –  భీమపుల్ అనే ఒక పెద్ద రాతి బండ ఉంటుంది. పాండవులు నదిని దాటడానికి భీముడు ఈ రాతిని ఒక వంతెనగా ఏర్పాటు చేశాడని అంటారు. ఈ రాతిమీద భీముని వేలిముద్రలు ఉన్నట్లుగా పెద్దపెద్ద అచ్చులున్నాయి. వంతెన దాటాక స్వర్గారోహణ మార్గం. ‘మాన’ నుంచి ‘చట్మోలి’  8 కి.మీ. ఉంటుంది.

మార్గమధ్యంలో భృగుమహర్షి ఆశ్రమం కనిపిస్తుంది. తర్వాత మాతమూర్తి ఆలయం కనిపిస్తుంది. ఈవిడే నరనారాయణుల కన్నతల్లిగా చెప్తారు. ఈ ప్రాంతం సముద్ర మట్టానికి 14,000 అడుగుల ఎత్తులో ఉంటుంది. తర్వాత కుబేర్మకుట్ అనే ప్రాంతం వస్తుంది. ఇక్కడే కుబేరుడి పుష్పక విమానాన్ని రావణాసురుడు బలవంతంగా తీసుకున్నాడంటారు.  ఇక్కడి నుంచి 5 కి.మీ. ప్రయాణం చేశాక వసుధార జలపాతం వస్తుంది. ఇక్కడే అష్ట వసువులు దాదాపు 1000 సంవత్సరాలు తపస్సు చేసినట్లుగా చెప్తారు. ఈ జలపాతం దాదాపు 120 మీటర్ల ఎత్తు నుంచి పడుతుంది. ఇక్కడ గాలులు బలంగా వీస్తుండడం చేత ధార చాలా పలుచగా నీటి తుంపర్ల లాగా పడుతుంది. అందుకే పాపులపై ఈ జలధార పడదు అని కూడా చెప్తారు.

తర్వాత (12,000 అడుగుల ఎత్తులో ) చట్మోలి అనే అందమైన పచ్చని బయళ్లు ఉండే ప్రాంతం వస్తుంది. ఇక్కడే ‘‘సతోపంత్’’ మరియు భగీరథ్ కర్క్ అనే రెండు నదులు (హిమానీ నదాలు) కలిసి ‘అలకనంద’ గా ఏర్పడతాయి. చట్మోలి నుంచి 1 కి.మీ. తర్వాత లక్ష్మివన్ ప్రాంతం వస్తుంది. ఇది ఒక అందమైన రకరకాల పూలు ఉండే ప్రాంతం. ఇక్కడ ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇక్కడే శ్రీ మహాలక్ష్మీ విష్ణువులు కొంతకాలం తపస్సు చేసినట్లు చెప్తారు. ఇక్కడే ద్రౌపది దేవి తనువు చాలించింది అని కూడా చెప్తారు.

ఇక్కడి నుంచి 2 కి.మీ. ప్రయాణించాక బంధర్ అనే ప్రాంతం వస్తుంది. ఇక్కడే ధర్మరాజు దాహార్తి తీర్చడానికి అర్జునుడు బాణ ప్రయోగం చేశాడని చెప్తారు. బంధర్ నుంచి సహస్రధార, చక్ర తీర్థం 5 కి.మీ. (15,000 అడుగుల ఎత్తులో). చక్రతీర్థం విష్ణుమూర్తి తన సుదర్శన చక్రాన్ని కింద పెట్టడం వల్ల ఏర్పడిన సరస్సుగా చెప్తారు. ఇక్కడే అర్జునుడు తనువు చాలించాడని అంటారు. చక్రతీర్థం నుంచి సతోపంత్ 5 కిలోమీటర్లు.

సతోపంత్ అనేది త్రిభుజాకృతిలో ఉండే సరస్సు. ఇది 5 పర్వతాల మధ్య ఉండే సుందరమైన స్వచ్ఛమైన నీరు ఉండే సరస్సు. ఇక్కడే ఏకాదశి రోజున త్రిమూర్తులు స్నానం చేస్తారని, గంధర్వులు పక్షుల రూపంలో వారిని సేవిస్తారని చెప్తారు. ఏకాదశి రోజున ఇక్కడ పక్షుల సమూహాన్ని చూడవచ్చు. ఇక్కడే భీముడు తనువు చాలించాడని చెప్తారు.

సతోపంత్ నుంచి స్వర్గా రోహిణం 8 కి.మీ. ఈ మార్గం బహు కష్టంగానూ ప్రయాణానికి దుస్సాహసంగానూ  ఉంటుందంటారు. మార్గమధ్యలో ద్రకుండ్, సూర్యకుండ్ అనే సరస్సులు ఉంటాయి.  ఇక్కడి నుంచే ధర్మరాజు మాత్రమే ఒక కుక్క తోడురాగా స్వర్గానికి ప్రయాణించాడు అని ప్రతీతి.

నిజానికి ‘స్వర్గారోహిణి’ అనేది 6 పర్వతాల సమూహంగా చెప్తారు. ఇందులో స్వర్గారోహిణి 1 అనేది ముఖ్యమైంది. ఇది ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉత్తరకాశి జిల్లాలోని ఘర్వాల్ హిమాలయ ప్రాంతానికి చెందినది. దీనికి పడమర వైపు గంగోత్రి పర్వత సముదాయం ఉంటుంది. ఈ స్వర్గారోహిణి పర్వతాగ్రం (20,512 అడుగుల ఎత్తులో, 6,252 మీటర్ల ఎత్తులో) మబ్బులలో ఉంటుందని, అది 3 మెట్లు వలే ఉంటుంది అని అవి ఎక్కి పైకి వెళ్తే మబ్బులలో మరో 4 మెట్లు ఉంటాయని అవి కూడా ఎక్కి పైకి వెళితే స్వర్గముఖ ద్వారానికి చేరుకుంటామని చెప్తారు.

Exit mobile version