TDP : మరో నెలన్నరలో జరుగబోయే ఏపీ ఎన్నికలు పార్టీల తలరాతలను మార్చబోతున్నాయి. వైసీపీ, టీడీపీ, జనసేనలకు ఈ ఎన్నికలు డూ ఆర్ డై అన్నట్టుగా మారిపోయాయి. అయితే పొత్తుల కారణంగా ప్రధానంగా పోటీ వైసీపీ, టీడీపీ కూటమి మధ్యే సాగనుంది. ఈ ఎన్నికల్లో వైసీపీని గద్దె దించడమే లక్ష్యంగా టీడీపీ కూటమి ఏ చిన్న అంశాన్ని వదిలిపెట్టడం లేదు.. వ్యూహాత్మకంగా ముందుకెళ్తోంది. ఇక షెడ్యూల్ రావడంతో అభ్యర్థుల ప్రకటనను వేగంగా పూర్తి చేసి ప్రచార బరిలోకి దిగేందుకు అన్ని పార్టీలు సన్నాహకాలు చేసుకుంటున్నాయి.
వైసీపీ ఇప్పటికే అభ్యర్థులు ప్రకటించగా.. టీడీపీ మొత్తం తాను పోటీ చేయబోయే 17 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడానికి రంగం సిద్ధం చేసినా అధికారిక ప్రకటన ఆలస్యమవుతోంది. దీనికి పలు కారణాలు కనపడుతున్నాయి. జనసేన పోటీ చేసే చోట టీడీపీ ఆశావహులను బుజ్జగించడం, బీజేపీ మరిన్ని సీట్లు అడుగుతుండడంతో టీడీపీ అభ్యర్థుల ప్రకటన ఆలస్యమవుతున్నట్లు తెలుస్తోంది.
వాస్తవానికి జనసేన పోటీ చేసే స్థానాలపై టీడీపీ నేతలు ఎంతో మంది ఆశలు పెట్టుకున్నారు. వారు సంవత్సరాలుగా అక్కడ క్యాడర్ ను కాపాడుకుంటూ ఖర్చులు పెట్టుకుంటూ వస్తున్నారు. తీరా పొత్తులో భాగంగా తమకు సీటు రాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పలు చోట్ల అసంతృప్తుల గొడవలు ఉండడంతో వాటిని సెట్ రైట్ చేసే పనిలో చంద్రబాబు బిజీగా ఉన్నారు.
ఇక అభ్యర్థుల ప్రకటనపై బీజేపీ కేంద్ర నాయకత్వం..రాష్ట్ర నాయకత్వంతో మాట్లాడుతోంది. అలాగే పొత్తులో భాగంగా మరికొన్ని అసెంబ్లీ కావాలని, లేదా మరో లోక్ సభ సీటు కావాలని అడుగుతోంది. కూటమి మధ్య సమన్వయం కొరవడడంతోనే టీడీపీ ఎంపీ అభ్యర్థుల ప్రకటనకు ఆలస్యమవుతోంది. లేకుంటే నిన్ననే అభ్యర్థుల ప్రకటన జాబితా వచ్చేది. ప్రస్తుతం నెలకొన్న సమస్యలను వేగంగా పరిష్కరించి ఫైనల్ లిస్ట్ ను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.