Chandrababu-Pawan : ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది పార్టీల హడావిడి మరింత పెరిగింది. ప్రతీ సీటులో గెలుపే లక్ష్యంగా పార్టీలు పోరాడుతున్నాయి. అందుకే ప్రతీ సీటును ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నాయి. వైసీపీ ఇప్పటికే మెజార్టీ సీట్లను ప్రకటించగా.. టీడీపీ, జనసేన పొత్తులో భాగంగా తమ అభ్యర్థులను ప్రకటించాయి. ఇందులో జనసేనకు 23 సీట్లు దక్కాయి. అయితే విజయవాడ పరిధిలో ఒక సీటును జనసేన కోరుతోంది. విజయవాడ పశ్చిమ నుంచి రెండు పార్టీల నేతలు బరిలో ఉన్నారు. సీటు తమదే అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో సీటు కేటాయింపు చంద్రబాబు, పవన్ కు పరీక్షగా మారింది.
విజయవాడ సెంట్రల్ లో 2014,2019 లో వరుసగా వైసీపీ విజయం సాధించింది. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఇక్కడ మరోసారి మైనార్టీ అభ్యర్థిని బరిలోకి దించింది. షేక్ ఆసిఫ్ కు నియోజకవర్గ బాధ్యతలు అప్పగించింది. సిట్టింగ్ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ ను సెంట్రల్ అభ్యర్థిగా ప్రకటించింది. సెంట్రల్ ఎమ్మెల్యే విష్ణుకు ఎమ్మెల్సీ హామీ ఇచ్చింది. ఇక టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్, మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న టికెట్ కోరుతున్నారు. జలీల్ ఖాన్ ఇప్పటికే వైసీపీ నేతల టచ్ లోకి వెళ్లారు. బుద్ధా వెంకన్న తనకు చంద్రబాబుపైన ఉన్న అభిమానాన్ని చాటుకోవడానికి రక్తాభిషేకం కూడా చేశారు. తనకు సీటు ఇవ్వాలని కోరుతున్నారు. ఇదే టైంలో ఈ సీటు పొత్తులో భాగంగా జనసేనకు వెళ్తుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.
పశ్చిమ సీటు నుంచి జనసేనకు ఇస్తున్నారని.. పవన్ ప్రకటన చేస్తారని ఆ పార్టీ నియోజకవర్గ ఇన్ చార్జి పోతిన మహేశ్ చెప్పుకొచ్చారు. దీంతో ఎవరికి సీటు దక్కుతుందనే పోటీ కొనసాగుతోంది. తొలి జాబితాలో ఈవివాదం కారణంగానే సీటు ప్రకటించలేదని సమాచారం. ఉమ్మడి కృష్ణా జిల్లాలో జనసేనకు అవనిగడ్డతో పాటుగా విజయవాడ పశ్చిమం ఖాయమని తెలుస్తోంది. అయితే ప్రకటన వచ్చే వరకు సీటు కోసం ఒత్తిడి చేస్తూనే.. ప్రకటన తర్వాత నిర్ణయం దిశగా ఆశావహులు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.
2014లో ఇక్కడ వైసీపీ నుంచి గెలిచిన జలీల్ ఖాన్ తర్వాతి కాలంలో టీడీపీలో చేరారు. ఇప్పుడు సీటు టీడీపీ నుంచి ఆశిస్తూ.. వైసీపీ నేత అయోధ్య రామిరెడ్డిని కలిశారు. వెంటనే అలర్ట్ అయిన టీడీపీ బుజ్జగించి వేచిచూడాలని సూచించింది.
విజయవాడలో ప్రస్తుతం రాజకీయం ఆసక్తికరంగా మారింది. ఎంపీగా ఉన్న కేశినేని నాని ఈసారి వైసీపీ నుంచి పోటీ చేయనున్నారు. వైసీపీ నుంచి నగరంలోని మూడు నియోజకవర్గాలకు అభ్యర్థులు ఖరారయ్యారు. టీడీపీ నుంచి తూర్పు- గద్దె రామ్మోహన్, సెంట్రల్- బోండా ఉమాకు కేటాయించారు. పశ్చిమం నుంచి బీసీ లేదా మైనార్టీ వర్గాలకు ఇవ్వాల్సి ఉంటుంది. రెండు వర్గాలకు చెందిన నేతలే రెండు పార్టీల నుంచి ఆశావహులుగా ఉన్నారు. వైసీపీ ఆవిర్భావం తర్వాత టీడీపీ ఈ నియోజకవర్గంలో గెలవలేదు. ఇప్పుడు పొత్తులతో ఆ సీటు కైవసం చేసుకోవాలని భావిస్తోంది. అయితే అభ్యర్థి ఎంపిక దగ్గరే సమస్య మొదలయ్యే అవకాశం కనిపిస్తోంది. దీంతో విజయవాడ పశ్చిమలో అభ్యర్థి.. గెలుపు ఎవరిదనే ఆసక్తి రాజకీయంగా మొదలైందని చెప్పవచ్చు.