Tinmar Mallanna : తెలంగాణలో ఎన్నికల జాతర నడుస్తోంది. ఒకవైపు లోక్ సభ ఎన్నికల జోరు నడుస్తుండగా.. మరోవైపు వరంగల్ – ఖమ్మం – నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ శుక్రవారం నామినేషన్ వేశారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేసిన తీన్మార్ మల్లన్న, ఆ తర్వాత నిర్వహించిన సభలో సంచలన నిర్ణయం తీసుకున్నారు.
ఆయన గతంలో చెప్పినట్టుగా తన కుటుంబానికి ఉన్న కోటిన్నర విలువైన ఆస్తులను ప్రభుత్వానికి అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ఈ మేరకు నామినేషన్ పత్రంతో పాటు తన ఆస్తులను ప్రభుత్వానికి అప్పగించడానికి బాండ్ ను కూడా తీసుకొచ్చినట్లు తెలిపారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎప్పుడు సమయం ఇస్తే అప్పుడు వెళ్లి తన ఆస్తి పత్రాలను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ద్వారా అప్పగిస్తానని తీన్మార్ మల్లన్న తెలిపారు.
గతంలో తీన్మార్ మల్లన్న తాను ప్రజాప్రతినిధిగా పోటీ చేయవలసి వస్తే తన ఆస్తులన్నీ ప్రభుత్వ పరం చేస్తానని చెప్పారు. ఈ క్రమంలోనే ఆన తన కుటుంబం పేరుతో ఉన్న మొత్తం ఆస్తిని తెలంగాణ ప్రభుత్వం పేరుతో బాండు రాశారు.