Loksabha Elections 2024 : దేశంలో ఎటు చూసినా సార్వత్రిక ఎన్నికల కోలాహాలమే కనిపిస్తోంది. గెలుపు కోసం ప్రధాన పార్టీలు వ్యూహ, ప్రతివ్యూహాలతో ముందుకెళ్తున్నాయి. ఇప్పటికే తొలి దశ ఎన్నికలు పూర్తికాగా, రెండో దశ పోలింగ్ నేడు 12 రాష్ట్రాల్లో, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో జరుగుతోంది. 15.88 కోట్ల మంది ఓటర్లు నేటి పోలింగ్ లో ఓటు వేయనున్నారు. దీనికి 1.67 లక్షల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. భారీగా భద్రత బలగాలను మోహరించారు.
రెండో దశలో 88 లోక్ సభ స్థానాలున్నాయి. ఇందులో 73 జనరల్ స్థానాలు కాగా ఎస్సీ 9, ఎస్టీ 6 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలై సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది. పోలింగ్ ప్రక్రియ సజావుగా కొనసాగేందుకు అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండి చర్యలు తీసుకుంటోంది.
కేరళలోని 20 లోక్ సభ స్థానాలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించనున్నారు. కర్ణాటకలో 14, రాజస్థాన్ 13, మహారాష్ట్ర 8, ఉత్తరప్రదేశ్ 8, మధ్యప్రదేశ్ 6, అసోం 5, బిహార్ 5, బెంగాల్ 3, ఛత్తీస్ గడ్ 3, కశ్మీర్ 1, మణిపూర్ 1, త్రిపుర 1 స్థానంలో ఇవాళ పోలింగ్ జరగనుంది. మధ్యప్రదేశ్ లోని బెతుల్ స్థానంలో బీఎస్పీ అభ్యర్థి అకస్మాత్తుగా చనిపోవడంతో ఎన్నిక వాయిదా పడింది.
రెండో దశలో తమ భవితవ్యం తేలనున్న ప్రముఖ అభ్యర్థులు చాలా మందే ఉన్నారు. వారిలో రాహుల్ గాంధీ (వాయనాడ్), శశిథరూర్ (తిరువనంతపురం), ఛత్తీస్ గఢ్ మాజీ సీఎం భూపేశ్ భగేల్ (ఛత్తీస్ గఢ్), హెచ్ డీ కుమారస్వామి (మాండ్యా), గజేంద్రసింగ్ షెకావత్ (జోథ్ పూర్)..తదితరులు ఉన్నారు.
దేశంలో సార్వత్రిక ఎన్నికల సంరంభం కొనసాగుతున్న వేళ అధికార యంత్రాంగం జాగ్రత్తలు తీసుకుంటోంది. ఎన్నికల నిర్వహణలో అప్రమత్తంగా ఉంటున్నారు. ఎలాంటి అవాంతరాలు లేకుండా ఎన్నికలు నిర్వహించాలని చూస్తోంది. ఈనేపథ్యంలో ఎన్నికల తంతు ఎలాంటి గొడవలు లేకుండా చూసేందుకు సంకల్పించింది. ఎన్నికల కోసం అవసరమైన సిబ్బందిని కేటాయించింది. ఎలాంటి ఇబ్బందులు చోటుచేసుకోకుండా ఏర్పాట్లు చేసింది. సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి సరైన భద్రత చర్యలు తీసుకుంది.