Sudha Murthy : ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి భార్య, ప్రముఖ సంఘ సేవకురాలు, రచయిత్రి సుధా మూర్తిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాజ్యసభకు నామినేట్ చేశారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎక్స్ (ట్విటర్) లో ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించారు. ‘భారత రాష్ట్రపతి @Smt SudhaMurty జీని రాజ్యసభకు నామినేట్ చేసినందుకు నేను సంతోషిస్తున్నాను. సామాజిక సేవ, దాతృత్వం మరియు విద్యతో సహా విభిన్న రంగాలకు సుధాజీ చేసిన సేవలు అపారమైనవి, మరియు స్ఫూర్తిదాయకమైనవి’ అని మోదీ రాశారు.
సుధ రాజ్యసభలో ఉండడం దేశ ‘నారీ శక్తి’కి శక్తి వంతమైన నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ఆమెకు పార్లమెంటు పదవీ కాలం ఫలవంతంగా ఉండాలని ఆకాంక్షించారు.
సుధా మూర్తి ప్రస్తుతం మూర్తి ట్రస్ట్‌కు నేతృత్వం వహిస్తున్నారు. ఆమె తన కెరీర్‌లో అనేక పుస్తకాలను రచించారు. ఆమె డౌన్ టు ఎర్త్ వ్యక్తిత్వానికి ప్రసిద్ధి చెందింది. 73 ఏళ్ల సుధా మూర్తి 2006లో పద్మశ్రీ, 2023లో పద్మభూషణ్ అవార్డులు అందుకున్నారు.