Taj Mahal : మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు భారత పర్యటన కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మంగళవారం ఆయన తాజ్ మహల్ ను సందర్శించారు. నాలుగు రోజుల పర్యటన నిమిత్తం ఆదివారం మధ్యాహ్నం ఆయన ఢిల్లీకి చేరుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మాల్దీవుల ప్రథమ మహిళ సాజిదా మొహమ్మద్ తో కలిసి ఇవాళ ఉదయం ఆగ్రా చేరుకున్న ముయిజ్జు.. తాజ్ అందాలను వీక్షించారు. ఈ సందర్భంగా అక్కడ ఫొటోలు దిగారు.
తన పర్యటనలో భాగంగా రెండో రోజు సోమవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీతో ముయిజ్జు సమావేశమయ్యారు. అనంతరం నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో మొయిజ్జు కీలక వ్యాఖ్యలు చేశారు. తనని భారత్ కు ఆహ్వానించినందుకు భారత రాష్ట్రపతికి కృతజ్ఞతలు తెలిపారు. తనకు ఘనంగా స్వాగతం పలికిన ప్రధాని మోదీకి, దేశ ప్రజలకు కూడా కృతజ్ఞతలు చెబుతున్నానని అన్నారు. మాల్దీవులలో పర్యటించే వారిలో భారతీయులే అధికం కావడంతో వీరి సమావేశంలో టూరిజం అంశం కూడా ప్రధానంగా చర్చకు వచ్చింది.