TDP Senior Leaders : ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. అంతకంటే ముందు కేంద్రంలోనూ ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరింది. ఈ సారి జరిగిన ఎన్నికల్లో ఎన్డీయే ప్రభుత్వ ఏర్పాటులో టీడీపీ కీలకంగా మారిన సంగతి తెలిసిందే. మోడీ 3.0 కేబినెట్లో టీడీపీకి ఇప్పటికే రెండు కేంద్రమంత్రి పదవులు దక్కాయి. ఈ సమయంలో బీజేపీ పెద్దల నుంచి టీడీపీకి మరో అవకాశం దక్కే అవకాశం ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. వాటిలో భాగంగా గవర్నర్ పదవి తెరపైకి వచ్చింది. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్న టీడీపీకి గవర్నర్ పదవి ఇచ్చేందుకు బీజేపీ అగ్రనేతలు అంగీకరించారని అంటున్నారు. ఈ సమయంలో ఆ పార్టీ నుంచి ఒక అభ్యర్థి పేరు సూచించాలని చంద్రబాబును బీజేపీ పెద్దలు కోరినట్లు సమాచారం. దీంతో… ఆ పదవికి చంద్రబాబు ఎవరిని ఎంపిక చేస్తారనేది ప్రస్తుతం ఆసక్తిగా మారింది.
కేంద్రంలో టీడీపీ రెండు మంత్రి పదవులు, ఏపీ ప్రభుత్వంలో బీజేపీకి ఒక మంత్రి పదవి దక్కింది. ఈ సమయంలో కేంద్రంలోని మంత్రివర్గ ప్రమాణ స్వీకారం అనంతరం కొంతమందికి గవర్నర్ పదవులు ఇవ్వాలని బీజేపీ కసరత్తులు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా కీలక మిత్రపక్షాలకూ ఒక్కో పదవి ఇవ్వబోతున్నారని సమాచారం. దీంతో… టీడీపీకి ఒక గవర్నర్ పదవి ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. అందుకు గాను టీడీపీ నుంచి ఇద్దరు సీనియర్ నేతల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వారిలో అశోక్ గజపతిరాజు, యనమల రామకృష్ణుడి పేర్లు తెరపైకి వచ్చాయి. ఈ ఇద్దరిలో ఒకరి పేరును చంద్రబాబు సెలక్ట్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ ఇద్దరు నేతలూ తొలి నుంచీ టీడీపీలో కీలకంగా ఉంటూ బాబుకు అత్యంత సన్నిహిత నేతలగా పేరు తెచ్చుకున్నారు. గతంలో ఇద్దరూ అసెంబ్లీ స్పీకర్లు గానూ, ఆర్థిక మంత్రులు గానూ పనిచేసిన అనుభవాన్ని కలిగి ఉన్నారు. అశోక్ గజపతిరాజు కేంద్రమంత్రిగా కూడా పనిచేశారు. అశోక్ గజపతిరాజుకు గవర్నర్ పదవి దక్కితే… యనమలను రాజ్యసభకు పంపే అవకాశం ఉందని భావిస్తున్నారు.