Postal Ballot Voting : ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ఉత్కంఠతను రేకెత్తిస్తోంది. పోలింగ్ రోజైన మే 13వ తేదీ నాడు విధి నిర్వహణలో ఉండే ప్రభుత్వ ఉద్యోగుల కోసం నిర్వహించిన పోస్టల్ బ్యాలెట్ల ఓటింగ్.. ఎటు వైపు మళ్లిందనేది చర్చనీయాంశమైంది. పోస్టల్ బ్యాలెట్ ప్రారంభమైన తొలిరోజునే ఉద్యోగులు కదం తొక్కారు. టీడీపీ కూటమికే ఉద్యోగులు బలంగా మొగ్గు చూపినట్టు కనిపిస్తోంది. ఉద్యోగులు తమ అంతరాత్మ సాక్షిగా నిర్ణయాత్మక తీర్పును వెలువరించబోతున్నారన్నది ఈ ట్రెండ్ చూస్తే అర్థం అవుతోంది. తమను రోడ్డున పడేసిన వైసీపీ ప్రభుత్వంపై ఉద్యోగులు రెండేళ్ల కిందటే మనసు విరిగిపోయి ఈ సారి కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రభుత్వానికి ఓటుతో బుద్ధి చెబుతామని ఉద్యోగులు ఎన్నో సందర్భాల్లో చెబుతూ వచ్చారు.
పోస్టల్ బ్యాలెట్ ప్రారంభం రోజునే ఉద్యోగులు కదం తొక్కటం కూటమికి లాభించబోతోందన్నది తేటతెల్లమవుతోంది. 90శాతానికి పైగా టీడీపీ కూటమికే ఓట్లు వేసినట్టు తెలుస్తోంది. ఈ లెక్కన చూస్తే ఉద్యోగుల్లో వైసీపీ ప్రభుత్వం పట్ల ఉన్న తీవ్ర వ్యతిరేకత అర్థమౌతోంది. ఉద్యోగులే కదా అని అనుకోవటానికి వీల్లేదు. ఎందుకంటే వారి కుటుంబంలో ప్రతి ఒక్కరూ ఇదే వైఖరితో ఉండే అవకాశాలు పుష్కలం.
ఐదేళ్ల పాలనలో తాను చాలా విప్లవాలు తెచ్చానని గొప్పలకు పోతున్నారు జగన్ రెడ్డి. విప్లవం అంటే ఆ రేంజ్ అనుకుంటున్నారో.. ఆయన రచయితలు ఆ పదాన్ని సులువుగా వాడేస్తూంటారు. జగన్ భాషలో చెప్పాలంటే పోస్టల్ బ్యాలెట్ కు కూడా ఓ విప్లవం కనిపిస్తోంది. పోలింగ్ విధుల్లో ఉండి ఓటేసే అవకాశం లేని అత్యధిక మంది ఎన్నడూ లేని విధంగా పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా.. అటూ ఇటూ తిప్పినా చాలా ఓపిక పట్టి ఓటేశారు. ఇందు కోసం గంటల తరబడి నిలబడాల్సి వచ్చినా తగ్గలేదు. ఉద్యోగుల్లో ఓటు చైతన్యం పెరగడానికి.. 90 శాతానికిపైగా ఓటింగ్ జరిగేలా విప్లవం రావడానికి ఖచ్చితంగా వైసీపీ అధినేత జగనే కారణం అనుకోవచ్చు.
వైసీపీ ఇచ్చే డబ్బులకు ఆశ పడి ఇలా పోస్టల్ బ్యాలెట్ల కోసం ఎగబడి దరఖాస్తు చేసుకున్నారని ఆ పార్టీ నేతలు సోషల్ మీడియాలో చెప్పుకుంటున్నారు.. కానీ, అసలు నిజమేంటో వారికీ తెలుసు. ఉద్యోగులు అంత పట్టుదలగా ఎవరికి ఓట్లేశారో వారికీ తెలుసు. కేవలం డబ్బులిచ్చామని తమకు ఓట్లేస్తారన్న నమ్మకం పెట్టుకోవడం ఆ పార్టీ నాయకులు అవివేకం అనుకోవచ్చు. ఉద్యోగులు రాష్ట్ర భవిష్యత్ మాత్రమే కాదు.. తమ భవిష్యత్ నూ చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకే ఎక్కువ మంది ఓటు వేసేందుకు ప్రయత్నిస్తున్నారు.