YCP Politics : అమ్మ నువ్వు నా తల్లితో సమానం. అక్క నువ్వు తోబుట్టులాంటిదానవు. అన్నలు, తమ్ముళ్లు మనమంతా ఒక్కటే. మనం ఒక్క తల్లి పిల్లలం కాకపోవచ్చు. కానీ మిమ్మల్ని నా తోబుట్టు కంటే ఎక్కువ చూసుకుంటా. అంటూ బతిమిలాడిన వైసీపీ నాయకులు ఉన్నారు కొందరు. మరికొందరు నాయకులైతే కడుపులో తలపెట్టి దయచూపమన్నారు. ఇంకొందరైతే ఏకంగా పోయేది ఏమున్నది అని భావించి కాళ్ళు మొక్కిన వాళ్ళు సైతం ఉన్నారు. మీరే మాకు దిక్కు. మీరు దయతలిస్తేనే మేము గెలుస్తాం. మమ్మల్ని గెలిపిస్తే మీరు దేవుళ్ళు. ఆ దేవుడు ఉన్నాడో లేదో తెలియదు కానీ, కనబడుతున్న మీరే మాకు దేవుళ్లతో సమానం. అంటూ ఎన్నికల ప్రచారంలో బతిమిలాడిన నాయకులు సోమవారం నాటి పోలింగ్ సమయంలో ఎవరు మీరు , మీరు ఎంత మీ బతుకు ఎంత అంటా మానవత్వం మరచిపోయి ప్రవర్తించారు. ఇది చూసిన ఓటర్లు అప్పుడు, ఇప్పుడు మాట్లాడుతున్నది ఒక్కరేనా అంటూ ముక్కున వేలేసుకోవడంతో సరిపెట్టుకున్నారు.
తెనాలిలో ఓటువేయడానికి సుధాకర్ అనే ఓటరు పోలింగ్ బూత్ లో వరుసలో నిలబడ్డారు. అదే పోలింగ్ బూత్ లో తన ఓటు వేయడానికి వైసీపీ అభ్యర్థి శివకుమార్ రావడం జరిగింది. ఓటు వేయడానికి వచ్చిన ఓటర్లు ఎక్కువమంది ఉన్నారు. అంతేకాకుండా ఆయన అధికార పార్టీ అభ్యర్థి కాబట్టి అందరితో సమానంగా వరుసలో ఉండకుండా నేరుగా పోలింగ్ బూత్ లోకి వెళుతున్నారు. ఇది పద్దతి కాదు అంటూ సుధాకర్ వారించారు. ఎంతయినా వైసీపీ నేత కదా.. జీర్ణించుకోలేకపోయారు. పేరుకు తగ్గట్టుగానే శివమెత్తారు. శివతాండం చేసారు. సుధాకర్ చెంపై కొట్టారు. అంతటితో ఆయన అనుచరులు ఆగకుండా, మా నేతపైననే ఎదురు తిరుగుతావా, నువ్వు ఎంత, ఏమనుకుంటున్నావు అంటూ వాళ్ళు కూడా శివభక్తిని చాటుకోడానికి సుధాకర్ పై చేయి చేసుకున్నారు.
అదేవిదంగా పెనుమలూరు నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ సైతం పోలింగ్ కేంద్రంలో తన ప్రతాపాన్ని చూపించారు. పోలింగ్ సిబ్బంది సామాగ్రిని బయటకు విసిరేస్తూ పోలింగ్ నిలిపివేయాలంటూ సిబ్బందిపై దాడికి పాల్పడం చూసిన ఓటర్లు ఇదేనా మర్యాద అంటూ చెవులు కోరుకున్నారు చేసేది ఏమిలేక.