Police : ‘కర్ర ఉన్నోడిదే బర్రె’ ఈ సామెత ప్రస్తుత రాజకీయాలకు సరిగ్గా సరిపోతుంది. జగన్ హయాంలో టీడీపీ నేతలు, కార్యకర్తలను వైసీపీ నేతలు ఎంతలా వేధించారో ఏపీ అంతా చూసింది. వల్లభనేని వంశీ అనుచరులు ఈ ఏడాది ఫిబ్రవరి 20వ తేదీ పట్టపగలు గన్నవరంలోని టీడీపీ కార్యాలయంపై దాడి చేసి విధ్వంసం సృష్టించారు. వాహనాలకు నిప్పు పెట్టారు.
వారిని టీడీపీ సీనియర్ నేత పట్టాభి అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఆయనపైనే కేసు పెట్టి అరెస్ట్ చేసి జైలుకు పంపారు. కానీ టీడీపీ కార్యాలయంపై దాడి చేసిన వంశీ అనుచరులను, వారిని ఉసిగొల్పి పంపిన వంశీపై ఎటువంటి కేసు పెట్టలేదు.
అది అప్పటి కథ. ఇప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చింది. కాబట్టి వల్లభనేని వంశీతో సహా టీడీపీ కార్యాలయంపై దాడి చేసిన 71 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వారిలో 15 మందిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పర్చగా న్యాయమూర్తి జ్యూడిషియల్ రిమాండ్ కు పంపారు. వంశీతో సహా మిగిలినవారిని కూడా త్వరలో అరెస్ట్ చేయనున్నారు.
నాడు వంశీ అనుచరులు గన్నవరంలో టీడీపీ కార్యాలయంపై దాడి చేసి అక్కడున్న ఉన్న వాహనాలకు నిప్పు పెట్టినప్పుడు అవన్నీ సీసీ కెమెరాలలో రికార్డు అయ్యాయి. అవేవి పోలీసులు కలెక్ట్ చేసుకోలేదు. కానీ పట్టాభిరామ్ వారితో గొడవపడుతున్నట్లు సాక్ష్యాధారాలు మాత్రం ఉన్నాయని చూపిస్తూ అరెస్ట్ చేశారు. వంశీ వలన తన భర్త ప్రాణాలకు ప్రమాదం ఉందని పట్టాభిరామ్ సతీమణి ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు.
ఆ రోజు ఉన్న పోలీసులే నేడు ఉన్నారు. ఆ రోజు సీసీ కెమెరాలలో రికార్డు అయిన సాక్ష్యాధారాలే ఇప్పుడూ ఉన్నాయి. కానీ అప్పుడు పోలీసులు పట్టించుకోలేదు. వల్లభనేని అనుచరుల ఆగడాలకు సంబందించి సాక్ష్యాధారాలు లభించలేదు. ఇప్పుడు ఆ సాక్ష్యాధారాలన్నీ లభించాయి. వారు నేరం చేసినట్లు కూడా పోలీసులు గుర్తించి కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు.
అంటే పోలీసులు చట్ట ప్రకారం పనిచేయరా..? అధికార పార్టీ నేతల కన్నుసన్నల్లోనే పని చేస్తుంటారా..? అనే సందేహం కలుగకమానదు. ఏది ఏమైనప్పటికీ, అధికారం ఉంది కదా అని.. ఎప్పటికీ మనమే అధికారంలో ఉంటామనే భ్రమతో రెచ్చిపోతే, అవి పోయినప్పుడు ఏమవుతుందో గ్రహించేందుకు ఈ కేసే నిదర్శనం.
వైసీపీలో వల్లభనేని ఒక్కరే కాదు ఆ పార్టీ అధినేత జగన్ మొదలు దిగువ స్థాయి వరకు అందరూ ఇదే విధంగా వ్యవవరించారు. కనుక అందరూ ఇప్పుడు మూల్యం చెల్లించక తప్పదు.