Police Cracked : రూ.2.2 కోట్ల చోరీ కేసు.. గంటల్లో ఛేదించిన పోలీసులు
Police Cracked : రాజమహేంద్రవరంలోని హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ కు చెందిన రూ.2.2 కోట్ల చోరీ కేసును పోలీసులు ఛేదించారు. నిందితుడు అశోక్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు డబ్బును స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన వివరాలను ఎస్పీ నర్సింహ కిశోర్ మీడియాకు వెల్లడించారు.
హెచ్ డీఎఫ్ సీ ఏటీఎంలో డబ్బులు నింపే ఏజెన్సీ తరపున అశోక్ పనిచేస్తున్నాడని, పక్కా ప్రణాళికతోనే అతడు నగదు ఎత్తుకెళ్లినట్లు చెప్పారు. బ్యాంకు సిబ్బంది, సెక్యూరిటీ కళ్లుగప్పి అశోక్ పరారయ్యాడు. ఫిర్యాదు అందగానే 5 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గంటల వ్యవధిలో కేసును ఛేదించినట్లు చెప్పారు. నిందితుడు విలాసాలకు అలవాటు పడి చోరీకి ప్లాన్ చేశాడని వివరించారు.
నగదు తాను ఉంటున్న ఫ్లాట్ లోనే పెట్టి, రూ.50 వేలు కారు డ్రైవరుకు ఇచ్చి, రూ.9.50 లక్షలను తన వెంట తీసుకుని వెళ్లాడని తెలిపారు. తనవద్ద ఉన్న రూ.9 లక్షలను మరొక చోట ఇచ్చాడు. నగదు ఫ్లాట్ లోనే ఉండడంతో చుట్టుపక్కల తచ్చాడాడని తెలిపారు. సాంకేతిక ఆధారాలు, సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని పట్టుకున్నట్లు ఎస్పీ తెలిపారు.