America : విమాన ప్రయాణానికి సిద్ధమైన ఓ ప్రయాణికురాలికి చేదు అనుభవం ఎదురైంది. మహిళా సిబ్బందిని పొరపాటున ‘సర్’ అన్నందుకు విమానంలో నుంచి ఆమెను దించేశారు. ఈ ఘటన యునైటెడ్ ఎయిర్ లైన్స్ కు చెందిన విమానంలో చోటు చేసుకుంది.
అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో నుంచి ఆస్టిన్ బయలుదేరేందుకు విమానం సిద్ధమైంది. టెక్సాస్ కు చెందిన జెన్నా లాంగోరియా తన కుమారుడు (16 నెలలు), తల్లితో కలిసి అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో నుంచి ఆస్టిని వెళ్లడానికి అక్కడికి వచ్చారు. విమానం ఎక్కే సమయంలో సిబ్బంది బోర్డింగ్ పాస్ ను అందించారు. దాంతో మహిళా అటెండెంట్ ను పొరపాటుగా పురుషునిగా భావించి ‘థ్యాంక్యూ సర్’ అని తెలిపింది. వెంటనే ఆ అటెండెంట్ ఆగ్రహానికి గురై జెన్నా తల్లిని, బిడ్డను లోనికి వెళ్లకుండా ఆపేసింది. అదే సమయంలో జెన్నా మరో మేల్ అటెండెంట్ సాయం కోరింది.
తన తల్లి, కుమారుడిని గేట్ వద్ద మరో మేల్ అటెండెంట్ ఆపేశారని ఫిర్యాదు చేసింది. దాంతో ఆ సిబ్బంది మీరు ఫిర్యాదు చేయాలనుకున్న అటెండెంట్ ‘ఆయన’ కాదు ‘ఆమె’ అని బదులిచ్చారు. తన తప్పును తెలుసుకుని ఆ మహిళా సిబ్బందికి క్షమాపణలు చెప్పేందుకు యత్నించినా ఫలించలేదు. అంతటితో ఆగకుండా విమానం నుంచి దింపేశారని సోషల్ మీడియా ద్వారా ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.